కొత్తగా ఓపెన్ చేసిన తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌లో భారీ చోరీ.. రూ.50 కోట్ల విలువైన 42 కేజీల బంగారు ఆభరణాలు లూటీ

కొత్తగా ఓపెన్ చేసిన తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌లో భారీ చోరీ.. రూ.50 కోట్ల విలువైన 42 కేజీల బంగారు ఆభరణాలు లూటీ

మధురై: తమిళనాడులోని మధురై తనిష్క్ జ్యువెలరీ షోరూంలో భారీ చోరీ జరిగింది. దాదాపు 42 కేజీల బంగారు ఆభరణాలను దొంగలు దోచేశారు. తమిళనాడులోని మధురై బైపాస్ రోడ్డులో ఉన్న తనిష్క్ షోరూంలో ఈ భారీ దోపిడీ జరిగింది. నిన్న (నవంబర్ 11, 2026) రాత్రి ముసుగు ధరించిన గుర్తుతెలియని వ్యక్తి సెక్యూరిటీ కళ్లు గప్పి షోరూమ్‌లోకి ప్రవేశించి, సుమారు 42 కిలోల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయినట్లు సమాచారం.

ఎస్.ఎస్. కాలనీ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ టీం.. షోరూమ్ ఉద్యోగుల వేలిముద్రలను సేకరిస్తూ, అక్కడ దొరికిన ఇతర ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఉద్యోగులు రోజూలానే గురువారం ఉదయం కూడా షోరూమ్‌ను ఓపెన్ చేసిన తర్వాత ఈ భారీ దోపిడీ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

దీపావళికి ముందు.. కేవలం 15 రోజుల క్రితమే ఈ అవుట్‌లెట్‌ను ప్రారంభించారు. షోరూమ్ వెనుక గోడ, తలుపులు పగలగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించినట్లు ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. మదురై నగర పోలీస్ కమిషనర్ ఎస్. రాజేంద్రన్, డిప్యూటీ కమిషనర్లు ఏజీ ఇనిగో దివ్యాన్, ఎస్. వనితలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగతనంలో మొత్తం ముగ్గురు వ్యక్తులు ఇన్వాల్వ్ అయినట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిందని కమిషనర్ రాజేంద్రన్ మీడియాకు వివరించారు.

►ALSO READ | ఉత్తరప్రదేశ్‌లో కొత్త రాజకీయ కూటమి: హైదరాబాద్ MIM పార్టీ ఆధ్వర్యంలో కీలక మలుపు

అనుమానితులను గుర్తించి, వారి ఆచూకీ తెలుసుకోవడానికి దర్యాప్తు అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. జాగిలాలను రంగంలోకి దించారు. దొంగలు లాకర్లలో భద్రపరిచిన ఆభరణాలను ముట్టుకోకుండా, షోరూమ్‌లో ప్రదర్శనకు ఉంచిన నగలను మాత్రమే తీసుకువెళ్లారని డిప్యూటీ కమిషనర్ దివ్యాన్ చెప్పారు. షోరూమ్ యాజమాన్యం అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాతే దొంగిలించబడిన బంగారం ఎంత, ఏంటనే వివరాలపై కచ్చితమైన సమాచారాన్ని వెల్లడిస్తామని చెప్పారు.