ఓజోన్ పొరకు భారీ రంధ్రం.. భూమికి పొంచి ఉన్న ముప్పు

ఓజోన్ పొరకు భారీ రంధ్రం.. భూమికి పొంచి ఉన్న ముప్పు

Ozone Hole 2026: సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన కిరణాల నుంచి మన భూమిని, మనుషులను కాపాడే రక్షణ కవచం 'ఓజోన్ పొర'.. అయితే, అంటార్కిటికా (మంచు ఖండం) పైన ఈ ఓజోన్ పొరలో ఏర్పడిన రంధ్రం ఇప్పుడు భారీగా పెరిగింది. గత 48 ఏళ్లలో ఉపగ్రహాల ద్వారా గమనించిన లెక్కల ప్రకారం.. 2026లో ఏర్పడిన ఈ రంధ్రం ఏడో అతి పెద్దది కావడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని చూసి ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని, ఓజోన్ పొర తిరిగి బాగుపడే ప్రక్రియ సరైన దారిలోనే ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA) స్పష్టం చేసింది.

అసలేం జరిగింది.. రంధ్రం ఎంత పెద్దదైంది?: 

2026 సెప్టెంబర్ 18వ తేదీన అంటార్కిటికా పైన ఓజోన్ రంధ్రం తన గరిష్ట స్థాయికి చేరుకుంది. దీని విస్తీర్ణం సుమారు 10.5 మిలియన్ చదరపు మైళ్లు (2.71 కోట్ల చదరపు కిలోమీటర్లు) మేర పెరిగింది. అంటే మన భారతదేశం కంటే దాదాపు 8 రెట్ల కంటే పెద్దదన్నమాట. గత 48 ఏళ్ల చరిత్రలో ఇంత పెద్ద రంధ్రం ఏర్పడటం ఇది ఏడోసారి.

ఈ రంధ్రం ఇంతలా పెరగడానికి కారణమేంటి?: 

మనం వాడే ఫ్రిజ్‌లు, ఏసీల నుంచి వచ్చే విష వాయువుల వల్ల కాకుండా, ఈసారి ప్రకృతిలో జరిగిన కొన్ని వింత మార్పుల వల్లే ఈ ఓజోన్ రంధ్రం మరింత పెద్దదైందని నాసా నిపుణులు చెబుతున్నారు. అంటార్కిటికా పైన అత్యంత వేగంతో, విపరీతమైన చలి గాలులు సుడిగుండంలా తిరిగాయి. దీనివల్ల అక్కడ చలి బాగా పెరిగిపోయింది. ఆ విపరీతమైన చలికి ఆకాశంలో మంచు మేఘాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఎండ తగలగానే ఆ మేఘాల్లో జరిగే మార్పులతో ఓజోన్ పొర కొంతమేర కరిగిపోయి, రంధ్రం పెద్దదిగా కనిపించిందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

సైంటిస్టులు ఎందుకు ధీమాగా ఉన్నారంటే?: 

ఈ ఓజోన్ రంధ్రం విస్తీర్ణంలో పెద్దదిగా కనిపించినా, గతంలో ఏర్పడిన అత్యంత ప్రమాదకరమైన రంధ్రాలతో పోలిస్తే దీని తీవ్రత చాలా తక్కువగా ఉంది. ప్రపంచ దేశాలన్నీ కలిసి ఓజోన్ పొరను నాశనం చేసే విషవాయువుల వాడకాన్ని ఎప్పుడో నిషేధించాయి. ఆ మంచి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.. కేవలం వాతావరణంలోని చలి గాలుల వల్ల మాత్రమే ఈ ఏడాది రంధ్రం కాస్త పెద్దదైంది తప్ప, ఓజోన్ పొర తిరిగి పూర్తిగా కోలుకోవడంలో ఎలాంటి ఆటంకం లేదని నాసా భరోసా ఇస్తోంది.