చదువుకుంటేనే ఉద్యోగం వస్తుంది.. డిగ్రీలు ఉంటేనే భారీ ప్యాకేజీలు వస్తాయ్ అనుకునేవాళ్లకు ఒక సాధారణ కుక్ తన లైఫ్ స్టోల్ తో గట్టి సమాధానం ఇస్తున్నారు. ముంబైకి చెందిన మనురాజ్ గార్గ్ అనే వ్యక్తి తన లింక్డిన్ లో పంచుకున్న ఒక వంటమనిషి ఫైనాన్షియల్ సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాంటి ఐఐటీ, ఎంబీఏ డిగ్రీలు లేకపోయినా.. కేవలం వంట పనుల ద్వారానే ఆ వ్యక్తి నెలకు రూ. లక్షకు పైగా సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆ వంటమనిషి సంపాదన లెక్కలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఆయన కేవలం ఒక్కరిపైనే ఆధారపడకుండా అనేక మార్గాల్లో డబ్బులు వచ్చేలా ఏర్పాడు చేసుకున్నాడు. గార్గ్ ఇంట్లో రోజుకు 2 పూటలా వంట చేయడానికి నెలకు రూ.18వేలు తీసుకుంటుండగా.. అదే బిల్డింగ్‌లోని మరో ఫ్లాట్ నుంచి రూ.16వేల 500 సంపాదిస్తున్నారు. ఇక సమీపంలోని ఒక పెద్ద కుటుంబానికి వంట బాధ్యతలతో పాటు ఇతర కిచెన్ పనులు చూస్తున్నందుకు వారు నెలకు రూ.38వేలు చెల్లిస్తున్నారు. ఇవే కాకుండా సినిమా షూటింగ్ సెట్లలో రాత్రి పూట జరిగే షూట్ల కోసం క్రూ మెంబర్స్‌కు వంట వండే పనికి ఒక్కో రోజుకు రూ.7వేల 500 చొప్పున సంపాదిస్తున్నాడు. వీటన్నింటి ద్వారా ఆయన నెలవారీ సంపాదన రూ. లక్షా 5వేలకు చేరుకుంటోంది. అంతేకాకుండా ఆయన భార్య కూడా మరో రూ. 45వేలు సంపాదిస్తుండటంతో వారి మొత్తం సంపాదన నెలకు రూ.లక్షా 50వేలు అయ్యింది.
ఈ కుక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆసక్తికరంగా ఉంటుంది. పెద్ద చదువులు చదివి, కార్పొరేట్ ఉద్యోగాల్లో లక్షలు సంపాదిస్తున్న ఎంబీఏ, ఐఐటీ గ్రాడ్యుయేట్లకు భారీగా ఇన్కమ్ ట్యాక్స్, హోమ్ లోన్ ఈఎంఐలు, పిల్లల స్కూల్ ఫీజులు, విలాసవంతమైన జీవన శైలి ఖర్చులు పోను చేతిలో మిగిలేది చాలా తక్కువే. కానీ ఈ వంటమనిషికి అలాంటి పెద్ద ఆర్థిక భారాలు లేకపోవడంతో తన సంపాదనలో ఎక్కువ ఆదా చేసుకోగలుగుతున్నారు. పైగా తన పనులన్నీ కేవలం రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఉండటంతో ట్రాఫిక్‌లో గంటల తరబడి ప్రయాణించే శ్రమ కూడా తప్పింది. కేవలం ఒక్కరిపై ఆధారపడకుండా నలుగురు యజమానుల వద్ద పనిచేయడం వల్ల ఒకరిద్దరు మానేసినా తన ఉపాధికి ఎలాంటి ఢోకా ఉండదు.
ఖర్చుల విషయంలోనూ ఆయన చాలా స్పష్టమైన వైఖరి కలిగి ఉన్నారు. అనవసరమైన కార్లు, లగ్జరీల జోలికిపోకుండా తన లైఫ్ స్టైల్ చాలా సాదాసీదాగా ఉంచుకుంటూనే.. తన చిన్న చిన్న కోరికలను మాత్రం తీర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన EMIలో లేటెస్ట్ ఐఫోన్ ప్రో కొన్నారు.
ALSO READ: మోడీని ప్రశ్నించిన నార్వే జర్నలిస్ట్‌కు షాక్
అలాగే లైఫ్‌లో తొలిసారిగా విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యారు. తన స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్ ట్రిప్‌కు వెళ్తున్నారు. ఇతని జీవితంలో ఇదే మెుదటి ఫారెన్ ట్రిప్ కావడం, తొలిసారిగా విమానం ఎక్కడం, తొలిసారిగా పాస్‌పోర్ట్ పొందడం విశేషం. మయూ బే సందర్శన, అక్కడి స్ట్రీట్ ఫుడ్ రుచులు, స్కూటర్ రెంటల్స్ గురించి యజమాని మనురాజ్ గార్గ్‌తో ఆయన ఎంతో ఉత్సాహంగా చర్చించారు. చదువు, ఉద్యోగ హోదాలతో సంబంధం లేకుండా తెలివైన ఫైనాన్షియల్ ప్లానింగ్, కష్టపడే తత్వం ఉంటే జీవితంలో ఏ స్థాయికైనా చేరుకోవచ్చని ఈ వంటమనిషి స్టోరీ నిరూపిస్తోంది.
