సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గోట్ (G.O.A.T). ఇవాళ గురువారం (నవంబర్ 12, 2026న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ వేదవ్యాస్ తెరకెక్కించిన ఈ మూవీ క్రికెట్ బెట్టింగ్ మాఫియా, లవ్, కామెడీ, యాక్షన్ అంశాలతో రూపొందింది. ‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లితెరపై భారీ క్రేజ్ సంపాదించుకున్న సుధీర్.. ఈసారి వెండితెరపై ఎలాంటి కథతో వచ్చాడు? గోట్ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? హీరోగా సుధీర్ మరో మెట్టు ఎక్కారా? అసలు ‘గోట్’ కథేంటి? అనేది రివ్యూలో తెలుసుకుందాం..
G.O.A.T Movie కథేంటి?
1983లో భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిచిన తర్వాత దేశవ్యాప్తంగా క్రికెట్‌పై ఆసక్తి ఒక్కసారిగా పెరుగుతుంది. ఇదే నేపథ్యాన్ని తీసుకుని దర్శకుడు వేదవ్యాస్ అక్కుల ఈ కథను రూపొందించారు. కోనసీమలోని ఓ గ్రామంలో క్రికెట్ కేవలం ఆటగా కాకుండా.. బెట్టింగ్, డబ్బు, ఆధిపత్యానికి వేదికగా మారుతుంది. గ్రామంలో ఓ క్రికెట్ బెట్టింగ్ మాఫియా తన కార్యకలాపాలను విస్తరిస్తుంటుంది.
ఇదే గ్రామానికి చెందిన గణ (సుడిగాలి సుధీర్) బాధ్యతలు పట్టించుకోకుండా సరదాగా తిరిగే యువకుడు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో స్నేహితులతో కలిసి ఓ ఫేక్ కిడ్నాప్ ప్లాన్ చేస్తాడు. అయితే అనుకున్నది ఒకటైతే.. జరిగేది మరొకటి. పొరపాటున సుభాషిణి (దివ్యభారతి) కిడ్నాప్‌కు గురవుతుంది. ఈ అనుకోని పరిణామం గణ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది.
మరోవైపు గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ మాఫియా అరాచకాలు పెరిగిపోతుంటాయి. ఈ మాఫియాకు గ్రామంలో పలుకుబడి ఉన్న వ్యక్తి (నితిన్ ప్రసన్న) అండగా ఉంటాడు. అతడి ఆగడాలను అడ్డుకునేందుకు గ్రామ పెద్ద (సర్వదమన్ బెనర్జీ) ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో గణ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? సుభాషిణితో అతడి పరిచయం ప్రేమగా మారిందా? బెట్టింగ్ మాఫియా గ్యాంగ్‌తో గణకు ఎందుకు వైరం ఏర్పడింది? చివరకు ఆ మాఫియాను ఎదురించి గ్రామాన్ని కాపాడగలిగాడా? అనేదే మిగతా కథ.
విశ్లేషణ:
సాధారణంగా క్రికెట్ నేపథ్యంలో వచ్చే సినిమాల్లో ఆట, ఆటగాళ్ల పోరాటం, గెలుపోటముల ఎమోషన్స్ ప్రధానంగా కనిపిస్తాయి. కానీ ‘గోట్’లో క్రికెట్‌ను బెట్టింగ్ మాఫియాతో ముడిపెట్టి గ్రామీణ కథకు కొత్త కోణాన్ని జోడించారు. డబ్బు కోసం మొదలైన ఓ చిన్న కిడ్నాప్ ప్లాన్.. చివరకు ఓ పెద్ద మాఫియాను ఎదుర్కొనే స్థాయికి చేరుకోవడం కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్.
ఫస్టాఫ్ & సెకండాఫ్ ఎలా ఉన్నాయి?
గణ పాత్ర పరిచయం, అతడి స్నేహితులతో చేసే అల్లరి, సుభాషిణితో పరిచయం, కిడ్నాప్ ఎపిసోడ్ వంటి అంశాలతో కథ ముందుకు సాగుతుంది. సుధీర్ కామెడీ టైమింగ్‌కు అవకాశం ఉన్న సీన్స్, లవ్ సీన్స్ ఫస్టాఫ్‌లో ఆకట్టుకుంటాయి. కొన్ని సీన్స్ సాగదీసినట్టుగా ఉండటం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఇంతలోనే కిడ్నాప్ వ్యవహారం ఊహించని మలుపు తీసుకోవడం ఇంటర్వెల్లో ఆసక్తి పెంచుతుంది.
►ALSO READ | ఈవెంట్‌కు రూ.10 వేలు ఇచ్చినా.. ఈపాటికి కోకాపేటలో ఫ్లాట్ కొనేవాడిని: బుచ్చిబాబు కామెంట్స్ వైరల్
సెకండాఫ్‌లో క్రికెట్ బెట్టింగ్ మాఫియా వ్యవహారాలు, గ్రామంలో దాని ప్రభావం, గణ ఎదుర్కొనే సమస్యలు ప్రధానంగా కనిపిస్తాయి. లవ్ స్టోరీ నుంచి యాక్షన్, ఎమోషనల్ డ్రామా వైపు కథనం మలుపు తిరుగుతుంది. గణలో వచ్చే మార్పు, మాఫియాను ఎదుర్కొనే క్రమం కథకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయి. అయితే బెట్టింగ్ మాఫియా నేపథ్యాన్ని మరింత బలంగా చూపించాల్సిన అవసరం ఉందనే ఫీలింగ్ ఇస్తుంది. స్క్రీన్ ప్లే అక్కడక్కడా నెమ్మదించినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా కామెడీ, యాక్షన్, లవ్ స్టోరీ ఆడియన్స్ ఎంటర్ టైన్ చేస్తుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్..
కామెడీ, యాక్షన్, ఎమోషన్స్‌తో సుడిగాలి సుధీర్ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గణ పాత్రలో తనదైన నటనతో మెప్పించారు. గ్లామర్‌తో పాటు సుభాషిణి పాత్రలో దివ్యభారతి ఆకట్టుకున్నారు. సుధీర్‌తో కెమిస్ట్రీ బాగుంది. విలన్ ఛాయలున్న పాత్రలో నటుడు నితిన్ ప్రసన్న కథకు ఉత్కంఠను జోడించారు. సర్వదమన్ బెనర్జీ, బ్రహ్మాజీ, పృథ్వీ తమ అనుభవంతో పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ అంశాలు..
లియోన్ జేమ్స్ సంగీతం, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు కలిసొచ్చింది. ముఖ్యంగా యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ఇంపాక్ట్ చూపించింది. రసూల్ ఎల్లోర్, సన్నీ కొరపాటి సినిమాటోగ్రఫీ 1980ల నాటి గ్రామీణ వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించడంలో ముఖ్య పాత్ర పోషించింది. విజయ్ ముఖ్తవరపు ఎడిటింగ్ ఒకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.
