నీళ్లు తాగడానికి గోదావరిలోకి దిగిన ఆవు నోటిని కొరికిన మొసలి !

నీళ్లు తాగడానికి గోదావరిలోకి దిగిన ఆవు నోటిని కొరికిన మొసలి !

నీళ్లు తాగడానికి గోదావరిలోకి దిగిన ఆవు నోటిని మొసలి కొరికిన ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో కలకలం రేపింది. నిర్మల్ జిల్లా కడెం మండలం సారంగాపూర్ గ్రామంలోని సర్ల రాజేందర్కు చెందిన ఆవు మేత కోసం గోదావరి సమీపానికి వెళ్ళింది.

అక్కడే ఉన్న గోదావరిలోకి దిగి నీటిని తాగుతున్న క్రమంలో మొసలి ఆవు నోటిని కొరికింది. మొసలితో పోరాడిన ఆవు ఎట్టకేలకు బయటకు వచ్చింది. ఈ ఘటనతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో మొసళ్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి.

నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్ పట్ల గ్రామ శివారులోని ఒక పెద్ద కొలనులో వరద సమయంలో చేరిన మొసళ్లు క్రమంగా 60కి పైగా పెరగడంతో మొసళ్ల మడుగుగా మారింది. గోదావరి నదిపై నిర్మించిన శ్రీరామసాగర్ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఈ మడుగు 25 ఎకరాల విస్తీర్ణముంది. 

కొన్ని దశాబ్దాల క్రితం గోదావరి నది వరదల సమయంలో ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ద్వారా కొన్ని మొసళ్లు ఈ చెరువులోకి కొట్టుకొచ్చాయి. కాలక్రమేణా అవి ఇక్కడే స్థిరపడి, సంతానోత్పత్తి చేసి వాటి సంఖ్యను వందలకు పెంచుకున్నాయి. గత 40 ఏళ్లలో ఈ చెరువు ఎన్నడూ ఎండిపోలేదు. వర్షపు నీటితోపాటు భూగర్భ ఊట నీరు నిరంతరం ఊరడం వల్ల మొసళ్లకు ఇది సురక్షితమైన ఆవాసంగా మారింది.