NRIని టార్గెట్ చేసి రూ.2 కోట్లు కొట్టేసిన సైబర్ మోసగాళ్లు.. ఫారెక్స్ ట్రేడింగ్ మోసం

NRIని టార్గెట్ చేసి రూ.2 కోట్లు కొట్టేసిన సైబర్ మోసగాళ్లు.. ఫారెక్స్ ట్రేడింగ్ మోసం

ఆన్‌లైన్ మోసగాళ్లు రోజురోజుకు కొత్త రకం వ్యూహాలతో అమాయకులను, విదేశాల్లో ఉంటున్న NRIలను కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా కేరళకు చెందిన అమెరికా ఎన్‌ఆర్‌ఐ ఒకరు ఆన్‌లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ మోసంలో చిక్కుకుని ఏకంగా రూ. 2కోట్ల 11 లక్షలు పోగొట్టుకోవటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియా లింక్‌లు, టెలిగ్రామ్ గ్రూప్‌ల ద్వారా సాగిన క్రైమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..

ఎర్నాకులం జిల్లా కున్నత్తునాడుకు చెందిన 41 ఏళ్ల వ్యక్తి అమెరికాలో నివసిస్తున్నారు. ఇటీవల ఇతనికి ఇంటర్నెట్‌లో ఒక ఆకర్షణీయమైన ట్రేడింగ్ వెబ్‌సైట్ లింక్ కనిపించింది. 'హ్యాండ్‌టెక్ మార్కెట్స్' పేరుతో ఉన్న ఆ లింక్‌ను నమ్మి అతను మోసగాళ్ల వలలో చిక్కుకున్నాడు. తొలుత మోసగాళ్లు బాధితుడిని ఒక టెలిగ్రామ్ గ్రూప్‌లో చేర్చారు. ఆ తర్వాత 'హ్యాండ్‌టెక్ మార్కెట్స్ గ్లోబల్ లిమిటెడ్' పేరుతో మరో నకిలీ లింక్‌ను పంపించి.. ఒక ఫేక్ ఫారెక్స్ ట్రేడింగ్ వెబ్‌సైట్‌కు మళ్లించారు. నిందితులు ఇచ్చిన లాగిన్ వివరాలతో బాధితుడు అందులో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. 

నిజమైన ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లా కనిపించే ఈ నకిలీ వెబ్‌సైట్‌ను చూసి నమ్మిన ఆ ఎన్‌ఆర్‌ఐ.. గత ఏడాది అక్టోబర్ నుంచి విడతలవారీగా తన బ్యాంకు ఖాతాల నుంచి నిందితులు సూచించిన వివిధ ఖాతాలకు డబ్బులు పంపాడు. ఇలా మొత్తంగా రూ. 2కోట్ల 11లక్షల 35వేల 077 ఆ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో పెట్టుబడి పెట్టారు. అయితే తాను పెట్టిన పెట్టుబడికి భారీగా లాభాలు వచ్చాయని.. వాటిని విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడే అసలు మోసం బయటపడింది. ఎంత ప్రయత్నించినా ఒక్క రూపాయి కూడా వెనక్కి రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి లబోదిబోమన్నాడు.

►ALSO READ | ఐటీ ఉద్యోగం కంటే ఈ వంటోడి జీవితమే బాగుంది : నెలకు లక్ష.. ఐఫోన్, ఫారెన్ ట్రిప్స్

బాధితుడి తరఫున ఆయన స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎర్నాకులం రూరల్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ మోసం జరిగి కొంత కాలం గడిచిపోవడం, ఫిర్యాదు చేయడంలో ఆలస్యం జరగడం వల్ల రికవరీ ప్రయత్నాలు క్లిష్టంగా మారే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. డబ్బు ఏయే బ్యాంకు ఖాతాలకు మళ్లిందో ఆ ఖాతాలను ఫ్రీజ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

ఈ ఘటన సైబర్ నేరాల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరిస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే ట్రేడింగ్ యాప్‌లు, అధిక లాభాల ఆశ చూపే ఫారెక్స్ స్కీమ్‌లను గుడ్డిగా నమ్మితే ఇలాగే కోట్లు కోల్పోవాల్సి వస్తుంది. ఎవరైనా సరే ఆన్‌లైన్ పెట్టుబడులు పెట్టే ముందు సదరు సంస్థల ప్రామాణికతను, సెబీ, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను కచ్చితంగా పరిశీలించాలని తాజా సైబర్ క్రైమ్ హెచ్చరిస్తోంది అందరినీ.