నడిరోడ్డుపై కమిన్స్ దంపతుల కొట్లాట.. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో వీడియో వైరల్!

నడిరోడ్డుపై కమిన్స్ దంపతుల కొట్లాట.. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో వీడియో వైరల్!

Pat Cummins: ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేస్తున్న 'సాండ్‌పేపర్ 2.0' (బాల్ ట్యాంపరింగ్) వివాదంపై ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) ఎట్టకేలకు స్పందించాడు. మాజీ సహచర ఆటగాడు ఉస్మాన్ ఖవాజా చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో.. రేపు (2026, నవంబర్ 13, శుక్రవారం) ఉదయం మీడియా ముందుకు వచ్చి అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని కమిన్స్ ప్రకటించాడు. మరోవైపు, పబ్లిక్ ప్లేస్‌లో తన భార్య బెక్కీతో కొట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

అసలు వివాదం ఏంటి?: 

2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్స్ బంతిని కరాబ్ (బాల్ ట్యాంపరింగ్) అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఆ ఘటనలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై నిషేధం విధించారు. తాజాగా ఉస్మాన్ ఖవాజా తన పుస్తకం 'సబర్' (Sabr) లో సంచలన విషయాలు బయటపెట్టాడు. ఆనాడు బంతిని పాడుచేసే ప్లాన్ గురించి కమిన్స్‌తో సహా జట్టులోని ఆటగాళ్లందరికీ ముందే తెలుసని ఖవాజా ఆరోపించాడు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాగే ప్రయత్నించారని చెప్పడంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో మళ్లీ మంటలు రాజుకున్నాయి. ఇప్పటికే పేసర్ మిచెల్ స్టార్క్ ఈ ఆరోపణలను కొట్టిపారేయగా, కమిన్స్ మాత్రం ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్నాడు.

రేపు ఉదయం కమిన్స్ ప్రెస్ మీట్:
 
ఖవాజా చేసిన ఆరోపణలపై స్పందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని పాట్ కమిన్స్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తెలిపాడు. రేపు (శుక్రవారం, నవంబర్ 13, 2026) ఉదయం క్రికెట్ సెంట్రల్‌లో ప్రాక్టీస్ అనంతరం, ఉదయం 9:30 గంటలకు మీడియాతో మాట్లాడుతాను.. ఈ వారం జరిగిన పరిణామాలన్నింటిపైనా ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను.. ఉస్మాన్ ఖవాజా చేసిన ఆరోపణల పూర్తి వివరాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టిందని కమిన్స్ పేర్కొన్నాడు.

►ALSO READ | కోహ్లీ, రోహిత్ సలహాతో నా ఆటే మారింది.. పేస్ కంటే స్కిల్‌నే నమ్ముతా: ఆకిబ్ నబీ

భార్యతో గొడవ పుకార్లకు ఫుల్‌స్టాప్: 

ఈ వివాదం నడుస్తుండగానే, పబ్లిక్ ప్లేస్‌లో కమిన్స్ తన భార్య బెక్కీ (Becky) తో కొట్లాడుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇద్దరి మధ్య ఏదో తేడా ఉందంటూ పుకార్లు మొదలయ్యాయి. కానీ, ఈ ప్రచారానికి కమిన్స్ భార్య బెక్కీ ఒక్క పోస్ట్‌తో ముగింపు పలికింది. ఆసీస్ కెప్టెన్, తమ కూతురితో కలిసి ఉన్న అందమైన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ "మై లవ్స్" (My loves) అని క్యాప్షన్ పెట్టింది. దీంతో తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, అంతా బాగానే ఉందని ఈ జంట స్పష్టం చేసినట్లయింది.