మోడీని ప్రశ్నించిన నార్వే జర్నలిస్ట్‌కు షాక్: హైదరాబాద్ 'భారత్ సమ్మిట్'‌కు రాకుండా వీసా రద్దు

మోడీని ప్రశ్నించిన నార్వే జర్నలిస్ట్‌కు షాక్: హైదరాబాద్ 'భారత్ సమ్మిట్'‌కు రాకుండా వీసా రద్దు

ప్రధాని మోడీని గతంలో బహిరంగంగా ప్రశ్నించిన నార్వేకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ హెల్లె లింగ్(Helle Lyng) ఉదంతం ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. హైదరాబాద్ వేదికగా జరగనున్న 'భారత్ సమ్మిట్'లో పాల్గొని, ప్రసంగించేందుకు ఆమెకు అధికారికంగా ఆహ్వానం అందింది. అన్ని ఏర్పాట్లు చేసుకుని, వ్యాలీడ్ వీసా, పాస్‌పోర్ట్‌ చేతిలో ఉన్నప్పటికీ ఆమెను నార్వే విమానాశ్రయంలో అడ్డుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఓస్లో కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ దినపత్రిక 'డ్యాగ్‌సావిసెన్'లో జర్నలిస్టుగా పనిచేస్తున్న హెల్లె లింగ్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. తాను బుధవారం ఉదయమే భారత్‌కు బయలుదేరాల్సి ఉండగా, చివరి నిమిషంలో కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తన వీసా రద్దు చేసినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగే సదస్సులో మీడియా, పత్రికా స్వేచ్ఛ - ప్రజాస్వామ్యం అనే అంశంపై ప్యానెలిస్ట్, వక్తగా మాట్లాడాల్సి ఉందని తెలిపారు. ఈ పరిణామం వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని, తన ప్రయాణానికి అనుమతించాలని ఆమె కోరారు.

గత ఏడాది మే నెలలో నార్వేలో పర్యటించిన ప్రధాని మోడీని మీడియా స్వేచ్ఛకు సంబంధించి హెల్లె లింగ్ ఒక ప్రశ్న అడిగారు. అప్పట్లో ఆ ఘటన దేశవిదేశాల్లో సంచలనం సృష్టించింది. సరిగ్గా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. భారత ప్రధానిని ప్రశ్నించినందుకే తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడి వీసా రద్దు చేశారని పరోక్షంగా ఆరోపించారు. అయితే నార్వేలోని భారత రాయబార కార్యాలయం తన విషయంలో ఎంతో సహకరించిందని, కానీ భారత హోంశాఖ కావాలనే తన పర్యటనను అడ్డుకుందని ఆమె మరో పోస్టులో పేర్కొన్నారు.

నవంబర్ 14న హైదరాబాద్‌లో జరిగే 'భారత్ సమ్మిట్' రెండు రోజు సెషన్‌లో హెల్లె లింగ్ ప్రసంగించాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో పలువురు జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రముఖులు, నిపుణులు పాల్గొననున్నారు. ఈ ఘటనపై విపక్షాలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. దేశంలో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడానికి ఇదో నిదర్శనమంటూ విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా.. ఒక విదేశీ జర్నలిస్ట్‌కు వీసా రద్దు కావడం, అది కూడా నేరుగా ప్రధానిని ప్రశ్నించిన నేపథ్యంతో ముడిపడి ఉండటం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.