చివరి వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి స్కూటీపై వెళుతుండగా ఘోరం జరిగిపోయింది !

చివరి వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి స్కూటీపై వెళుతుండగా ఘోరం జరిగిపోయింది !

బెంగళూరులో విషాద ఘటన జరిగింది. నవంబర్ 16న పెళ్లి. ఇంతలోనే మృత్యువు లారీ రూపంలో యువతిని మింగేసింది. ఆమెతో పాటు ఆమె మేనత్త కూతురు కూడా ప్రాణాలు కోల్పోయింది. పెళ్లి పత్రికలను పంచడానికి వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. 

బుధవారం మధ్యాహ్నం మైసూరు రోడ్డులోని దీపంజలినగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ఇద్దరూ ప్రయాణిస్తున్న స్కూటీని లారీ ఢీకొనడంతో 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని, ఆమె 19 ఏళ్ల కజిన్ మృతి చెందారు. సింధుశ్రీ అనే యువతి తన పెళ్లి పత్రికలను పంచడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషాదంతో పెళ్లి వేడుకలతో కళకళలాడాల్సిన ఇంటిని శోకసంద్రంలో ముంచేసింది. సింధుశ్రీ హల్దీ గురువారం జరగాల్సి ఉంది.

ఆమె వివాహ విందు నవంబర్ 15న ఆదివారం ఫిక్స్ చేశారు. ఆమె వివాహం నవంబర్ 16న మాండ్యా జిల్లాలోని నాగమంగళ తాలూకాలో జరగాల్సి ఉంది. గురువారం విక్టోరియా ఆసుపత్రి మార్చురీలో ఆమె శవంగా విగతజీవిగా పడిన పరిస్థితి రావడం శోచనీయం. ఆమె తండ్రి ఆటో డ్రైవర్. ఆమె తండ్రి నంజుండప్ప, తన ఒక్కగానొక్క కూతురి గురించి మాట్లాడుతూ కన్నీటితో కుప్పకూలిపోయాడు. "ఈరోజు నా కూతురికి హల్దీ వేడుక జరగాల్సి ఉంది. దానికి బదులుగా, నేను ఆమె అంత్యక్రియలకు సిద్ధమవుతున్నాను. ఆదివారం ఆమె వివాహ విందు జరగాల్సి ఉంది, మా ఇల్లంతా పెళ్లి ఏర్పాట్లతో నిండిపోయింది. ఇప్పుడు అంతా ముగిసిపోయింది" అని ఆయన మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యాడు.

సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే సింధుశ్రీ, ఒక బంధువుకు చివరి పెళ్లి పత్రికను ఇవ్వడానికి బయటకు వెళ్లింది. ఆమె ఇంటి పక్కన వాళ్ల దగ్గర నుంచి స్కూటీ తెచ్చుకుని, ఆమె మేనత్త కూతురైన విద్యాను ఎక్కించుకుని స్కూటీ డ్రైవ్ చేస్తుంది. మైసూరు వైపు ప్రయాణిస్తున్న రాజస్థాన్ రిజిస్ట్రేషన్ ఉన్న లారీ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో వీళ్లు ప్రయాణిస్తున్న స్కూటర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. 

ALSO READ : కొత్తగా ఓపెన్ చేసిన తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌లో భారీ చోరీ..

ఈ ధాటికి ఇద్దరు మహిళలు రోడ్డుపైకి ఎగిరిపడ్డారు. ఆ తర్వాత ట్రక్కు వారిపై నుంచి దూసుకెళ్లింది. సింధుశ్రీ, విద్య స్పాట్లోనే చనిపోయారు. ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడు. సింధుశ్రీ తండ్రి ఫిర్యాదు ఆధారంగా బ్యాతరాయణపుర ట్రాఫిక్ పోలీసులు ట్రక్కును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం విక్టోరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.