EV కారు కొనాలంటే ఆధార్ మస్ట్.. ఇలా చేస్తేనే డిస్కౌంట్ వస్తుందంట..

EV కారు కొనాలంటే ఆధార్ మస్ట్.. ఇలా చేస్తేనే డిస్కౌంట్ వస్తుందంట..

ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలను (EV) కొనాలనుకునే  వారికి లేదా పాత వాహనాలను స్క్రాప్ చేసి ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందాలనుకునే వారికి రవాణా శాఖ కీలక నిబంధనను  తీసుకొచ్చింది. ఇకపై ఢిల్లీ ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ–2026 కింద ప్రభుత్వం అందించే కొనుగోలు, స్క్రాపింగ్ ప్రోత్సాహకాలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాలి. అంతేకాదు, ఆధార్ వివరాలను ఓటీపీ (OTP) ద్వారా ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.

రవాణా శాఖ తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనను ఈవీ ప్రోత్సాహకాల కోసం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ దరఖాస్తు విధానంలో భాగంగా అమలు చేయనున్నారు.

దరఖాస్తు చేసుకోవాలంటే ఏం చేయాలి?
ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈవీ ఇన్సెంటివ్ పోర్టల్ ద్వారా ప్రోత్సాహకాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఆధార్ నంబర్‌ను ఎంటర్  చేయాలి. తరువాత ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఉపయోగించి మీ  వివరాలను ధృవీకరించుకోవాలి.

కొనుగోలు ప్రోత్సాహకాలు, పాత వాహనాలను స్క్రాప్ చేసినందుకు ఇచ్చే ప్రోత్సాహకాలు.. ఈ రెండింటికీ ఈ ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుంది. దరఖాస్తు సమర్పించే సమయంలోనే కాకుండా, దరఖాస్తు పరిశీలన ప్రక్రియలోనూ ఈ ధృవీకరణ అవసరమవుతుంది.

ఆధార్ లేకపోతే ఏం చేయాలి?
ప్రస్తుతం ఆధార్ కార్డు లేని వారు లేదా ఇంకా ఆధార్ కోసం రిజిస్టర్ చేసుకోని వారు ముందుగా ఆధార్ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలి. ఆధార్ నమోదు చేసుకున్న తర్వాతే ఈవీ ప్రోత్సాహకాల పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీని కోసం అర్హులైన వారు మీ దగ్గరలోని అధీకృత ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించాలి. దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ నమోదు కేంద్రాల వివరాలను UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

అందరికీ ప్రోత్సాహకాలు వస్తాయా?
ఆధార్ నంబర్ సమర్పించి ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసినంత మాత్రాన అందరికీ ప్రోత్సాహకాలు లభిస్తాయని కాదు. ఢిల్లీ ఈవీ పాలసీ–2026లో పేర్కొన్న అర్హత నిబంధనలు, షరతులు తప్పనిసరిగా పాటించాలి. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ప్రోత్సాహకాల ఆర్థిక పరిమితులు, దరఖాస్తు గడువులు, ఇతర మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నవారికే ప్రయోజనాలు అందుతాయి.

ఆధార్ వివరాల సేఫ్టీ పై కూడా స్పష్టత
ఈ ప్రక్రియలో దరఖాస్తుదారుల నుంచి సేకరించే ఆధార్ నంబర్లు, ఇతర సంబంధిత వివరాలను ఆధార్ చట్టం & దానికి సంబంధించిన నిబంధనలకు అనుగుణంగానే ఉపయోగించాలని రవాణా శాఖ స్పష్టం చేసింది.

చివరగా.... ఢిల్లీ ఈవీ పాలసీ–2026 కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు లేదా పాత వాహనాల స్క్రాపింగ్‌పై ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందాలనుకునే వారు ఇకపై ఆధార్ కార్డుతో పాటు, ఓటీపీ ద్వారా గుర్తింపును ధృవీకరించుకోవడం తప్పనిసరి. ఆధార్ లేని వారు ముందుగా ఆధార్ నమోదు చేసుకున్న తర్వాతే ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.