- ఓబీసీల జనాభాను కచ్చితంగా లెక్కించాలని డిమాండ్
- 28న ‘చలో రామ్‌లీలా మైదాన్’కు బీసీ సంఘాల పిలుపు
న్యూఢిల్లీ, వెలుగు: రాబోయే జనగణనలో సమగ్ర కులగణన చేపట్టి ఓబీసీల జనాభాను కచ్చితంగా లెక్కించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నెల 28న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ‘చలో రామ్‌లీలా మైదాన్’ పేరుతో భారీ నిరసన నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా ఓబీసీ కోఆర్డినేషన్ కమిటీ ప్రకటించింది. ఈలోగా కులగణనపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరింది. గురువారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో నిరసన పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు పి. విల్సన్, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 2027 జనగణనలో కులగణనను శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించాలని నేతలు డిమాండ్ చేశారు. కులాల పేర్ల నమోదులో తప్పులు నివారించేందుకు రాష్ట్రాలవారీగా డ్రాప్‌డౌన్ జాబితాలు, ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రామాణిక కులాల డైరెక్టరీ రూపొందించి, సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర గణాంకాలు సేకరించాలని సూచించారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించి జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
గణాంకాలు లేకుంటే అసమానతలు ఎలా తెలుస్తాయి?
కచ్చితమైన గణాంకాలు లేకుండా అసమానతలను అంచనా వేయలేమని ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ అన్నారు. ఈ చారిత్రాత్మక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓబీసీ కాలమ్ చేర్చడం వల్ల ప్రభుత్వానికి అదనపు ఆర్థిక భారం ఉండదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. జనాభా వివరాలు కచ్చితంగా లేకపోవడంతో బీసీల రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల అమలులో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. కులాల నమోదులో తప్పులు నివారించేందుకు ప్రత్యేక కోడ్లు, డ్రాప్‌డౌన్ జాబితాలు అవసరమని ఎంపీ పి. విల్సన్ అన్నారు.
