ఏపీలో గ్రామ పంచాయితీ ఎన్నికలు సంపిస్తున్న క్రమంలో పొలిటికల్ హీట్ పెరిగింది. మున్సిపల్ కార్పొరేషన్, పరిషత్ ఎన్నికల వేళ నెలకొన్న ఘర్షణల కారణంగా పంచాయితీ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. సర్పంచ్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో కడియం సర్పంచ్ అభ్యర్థి విశ్వశ్రీ ప్రియ ప్రకటన సంచలనం రేపుతోంది. తనను ఏకగ్రీవంగా గెలిపిస్తే.. గ్రామాభివృద్ధికి రూ. కోటిన్నర విరాళంగా ఇస్తానని ప్రకటించింది విశ్వశ్రీ ప్రియ.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ళ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దూడల నాగేశ్వరరావు కుమార్తె, ఎంబీబీఎస్ విద్యార్థిని అయిన విశ్వశ్రీ ప్రియ ఈ ప్రకటన చేయడం సంచలనంగా మారింది.ఇటీవల దుళ్ళ గ్రామ మాజీ ఉపసర్పంచ్ తోకల శ్రీనివాస్ సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేస్తే గ్రామాభివృద్ధికి రూ. కోటి విరాళంగా ఇస్తానని చేసిన ప్రకటనపై ఆమె స్పందించారు.
తన తండ్రి దివంగత దూడల నాగేశ్వరరావు, తల్లి రత్నం గతంలో గ్రామ సర్పంచులుగా పనిచేసి గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారని... వారి ఆశయాలను కొనసాగిస్తూ గ్రామానికి సేవ చేయాలన్నది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు విశ్వశ్రీ ప్రియ.
మరో ఏడాదిలో తన ఎంబీబీఎస్ విద్య పూర్తవుతుందని, గ్రామ ప్రజలు తనకు సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే తల్లిదండ్రుల ఆశయ సాధనకు కృషి చేస్తానని అన్నారు. తనను సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎంపిక చేస్తే గ్రామాభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.1.50 కోట్లు విరాళంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
విశ్వశ్రీ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక సర్పంచ్ అభ్యర్థికి ఈ రేంజ్ లో పెట్టుబడి ఎలా సాధ్యం అని విస్తృతంగా చర్చ జరుగుతోంది. మరి, విశ్వశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికవుతారా లేక ఎన్నికల్లో పోటీ చేయక తప్పదా అన్నది వేచి చూడాలి.
