ప్రియదర్శి హీరోగా తెలంగాణ ఫోక్ సింగర్ నాగదుర్గ హీరోయిన్‌గా సుకుమార్ రైటింగ్స్, బన్నీవాస్ వర్క్స్ బ్యానర్లపై వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఇడుపు కాయితం’. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో ప్రియదర్శి మాట్లాడుతూ ‘ఇది మన కథ, మనందరి ఇళ్లలో జరిగే కథ. ఫ్యామిలీ డ్రామాను మించిన డ్రామా మరొకటి ఉండదు. ఇదొక గొప్ప సినిమా అవుతుందని ప్రామిస్ చేస్తున్నా’ అని చెప్పాడు. ఈ చిత్రంలో నటించడం చాలా హ్యాపీగా ఉందని నాగదుర్గ చెప్పింది. డైరెక్టర్ వంశీరెడ్డి దొండపాటి మాట్లాడుతూ ‘ఇడుపుకాయితం అనేది ఒక జంట విడిపోవడానికే కాదు.. అదే జంట విడిపోయాక కొత్త జీవితం ప్రారంభించడానికి ఒక సర్టిఫికెట్‌లా భావించాలి అనేది నా ఉద్దేశం’ అని చెప్పాడు.
ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకునే బ్యూటిఫుల్ స్టోరీ ఇదని నిర్మాత తబిత సుకుమార్ చెప్పారు. ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మాట్లాడుతూ ‘నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు అని భార్య అడిగే ప్రశ్నకు ఏ భర్త దగ్గరా సమాధానం ఉండదు. ఈ సినిమాలో మాత్రం ఆ ప్రశ్నకు ఒక క్యూట్ ఆన్సర్ వస్తుంది. కొత్తగా పెళ్లయిన జంటలకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది’ అని అన్నారు. నటీనటులు మైమ్ మధు, విద్యా సాగర్, విజయ, వినోద్ బాల, చంద్రవ్వ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
