న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16 నుంచి 18 వరకు ఫిలిప్పీన్స్ (మనీలా)లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 23వ ఆసియాన్ – భారత్ సదస్సులో పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత ప్రభుత్వం రూపొందించిన విదేశాంగ విధానం'యాక్ట్ ఈస్ట్' పాలసీలో ఆసియాన్ దేశాల భాగస్వామ్యం అత్యంత కీలకమని.. సుమారు 122 బిలియన్ డాలర్ల(రూ. 1.14 లక్షల కోట్లు)కు చేరిన ద్వైపాక్షిక వాణిజ్యంతో ఆసియాన్ మనకు ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉందని విదేశాంగ శాఖ పేర్కొంది.
ఈ సదస్సులో ఆసియాన్ దేశాలతో భారత్ సంబంధాలను, వాణిజ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై మోదీ చర్చిస్తారు. అలాగే, ఆసియాన్ నేతృత్వంలో జరిగే 21వ ఈస్ట్ ఆసియా సదస్సులోనూ ప్రధాని పాల్గొంటారు. 'భవిష్యత్తును నావిగేట్ చేయడం' ఈ ఏడాది సదస్సు ప్రధాన థీమ్‌గా ఉంది. సదస్సుల సందర్భంగా వివిధ దేశాల అధినేతలతోనూ మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఏర్పాటు చేసే ప్రత్యేక విందులోనూ ప్రధాని పాల్గొంటారు.
