- ఐదు రోజుల పోలీసు కస్టడీకి.. 8 మంది నిందితులు
- మేడ్చల్-మల్కాజిగిరి పోలీసుల అదుపులో మరో నిందితుడు
- 14 ఐవీఎఫ్ సెంటర్ల నుంచి డోనర్లు, ఆర్థిక లావాదేవీల వివరాలు సేకరణ
- కాల్‌డేటాతో దర్యాప్తు స్పీడప్
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అండాల అక్రమ సేకరణ, రవాణా కేసులో మేడ్చల్-మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ప్రధాన నిందితుడు అమిత్ శర్మతో పాటు మరో ఏడుగురు నిందితులను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. బేగంపేట పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుకు సంబంధించి.. నవంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు నిందితులను విచారించేందుకు కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిచ్చింది.
దీంతో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితులు అందరినీ అదుపులోకి తీసుకుని గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న అమిత్ శర్మ, నికత్ పర్వీన్, రేష్మా ఖాతూన్, మేఘావత్ శ్రీనివాస్ అలియాస్ సోను, జెప్రే ప్రదీప్, ఎస్కే పర్వీన్, విజయ్ భగ్వా రావు సలున్కే, పంకజ్ సోనీలను పోలీసులు విచారిస్తున్నారు.
43 మంది మహిళలు సురక్షితం
ఈ అండాల దందా వెనుక అసలు సూత్రధారులు ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫెర్టిలిటీ సెంటర్లు, ఐవీఎఫ్ కేంద్రాలు, మధ్యవర్తులు, ఏజెంట్ల ప్రమేయంపై లోతుగా విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్న మొత్తం 14 ఐవీఎఫ్ సెంటర్లు, ఏఆర్టీ (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ) బ్యాంకులకు పోలీసులు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 94 కింద నోటీసులు జారీ చేశారు. ఆయా ఆసుపత్రుల నుంచి డోనర్ల రిజిస్ట్రేషన్ వివరాలు, కేవైసీ పత్రాలు, అగ్రిమెంట్లు, హెల్త్ రికార్డులు, ఆర్థిక లావాదేవీల పత్రాలను సేకరించి పరిశీలిస్తున్నారు.
ఈ కేసులో ఏజెంట్లు మొత్తం 31 మంది మహిళలను అండాల సేకరణ కోసం తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ మహిళలను ఎలా ప్రలోభపెట్టారు? అండాల దానానికి వారిని ఎలా ఒప్పించారు? అనే కోణంలో నిందితులను ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, ఆ 31 మంది మహిళల వాంగ్మూలాలు, వైద్య చరిత్ర, గతంలో వారు అండాలు దానం చేసిన వివరాలు, సమ్మతి పత్రాలను కూడా పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులను అరెస్ట్ చేయగా, వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 43 మంది మహిళలను (31 మంది బాధితులతో పాటు ఇతరులను)
పోలీసులు రక్షించారు.
హాస్పిటల్స్, డాక్టర్ల పాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు
ఈ కేసులో నకిలీ ఆధార్ కార్డుల తయారీ కోణం కూడా వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాల తయారీలో కీలక పాత్ర పోషించిన ఏ-13 నిందితుడు ప్రవీణ్‌ను ఈ నెల 9వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్, రెండు ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి విశ్లేషిస్తున్నారు. అలాగే, నిందితుల బ్యాంకు ఖాతాల లావాదేవీలు, కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. మహిళలను ఎవరైనా మోసం చేశారా, బలవంతంగా అండాలు సేకరించారా, ఈ దందాలో హాస్పిటల్స్ యాజమాన్యాలు, డాక్టర్ల పాత్ర ఎంత ఉందనే అంశాలపై కూపీ లాగుతున్నారు. డోనర్లకు ఇస్తున్న డబ్బులు ఎంత, మధ్యవర్తులు ఎంత మింగుతున్నారు అనే విషయాలపై స్పష్టత రానుంది. పోలీస్ కమిషనర్ బి. సుమతి పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు చాలా పకడ్బందీగా కొనసాగుతోంది.
