హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మారారు. సజ్జనార్ స్థానంలో మహేశ్ భగవత్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం గురువారం 21 మంది IPS అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో అత్యంత కీలకమైన మార్పు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరగడం ఆసక్తికర పరిణామం.
1995 బ్యాచ్ IPS అధికారి మహేశ్ మురళీధర్ భగవత్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించారు. ఇప్పటివరకు లా అండ్ ఆర్డర్ విభాగంలో పనిచేసిన భగవత్, V C సజ్జనార్ స్థానంలో బాధ్యతలు స్వీకరించబోతుండటం గమనార్హం. సజ్జనార్‌ను తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేశారు. సీనియర్ IPS అధికారి డాక్టర్ సౌమ్య మిశ్రాను డైరెక్టర్ జనరల్, వుమెన్ అండ్ సేఫ్టీ, SHE టీమ్స్ అండ్ భరోసా విభాగానికి నియమించారు.
స్వాతి లక్రాను డైరెక్టర్ జనరల్, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్‌గా నియమించగా, చారు సిన్హాను యాంటీ-కరప్షన్ బ్యూరో (ACB) డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. CID కి అదనపు బాధ్యతలు కూడా సిన్హాకే కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. విక్రమ్ సింగ్ మాన్‌ను DGP, ఆపరేషన్స్, గ్రేహౌండ్స్ అండ్ OCTOPUS గా నియమించారు.
M స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్‌గా పోస్ట్ చేశారు. ఐఏఎస్ స్మితా సబర్వాల్ భర్త అయిన ఐపీఎస్ అకున్ సభర్వాల్‌కు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, లా అండ్ ఆర్డర్ బాధ్యతలు అప్పగించారు. S చంద్రశేఖర్ రెడ్డిని ACB డైరెక్టర్‌గా నియమించారు.
