డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ బిల్లును గట్టెక్కించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. 2026 ఏప్రిల్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.
ఆ బిల్లు ఆమోదానికి మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం కాగా ఈ మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోవడంలో మోదీ సర్కార్ ఫెయిల్ అయింది. దీంతో.. బిల్లు వీగిపోయింది. రాజ్యాంగం (131వ సవరణ) బిల్లు-2026, డీలిమిటేషన్ బిల్లు-2026, యూనియన్ టెరిటరీస్ లాస్ (అమెండ్మెంట్) బిల్లు-2026.. ఈ మూడు బిల్లులను న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఏప్రిల్ 16న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 17న అవి తిరస్కరణకు గురయ్యాయి.
మరోవైపు.. ఆగస్ట్ 13, 2026న సైన్ డై అయిన వర్షాకాల సమావేశాలను ఇప్పటి వరకు అధికారికంగా ప్రొరోగ్ చేయలేదు. ఈ అంశాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇటీవల లేఖ రాసి కేంద్రాన్ని నిలదీశారు. సెషన్ ముగిసి 64 రోజులు గడిచినా ఇరు సభలు ఇంకా ప్రొరోగ్ కాలేదని ఆయన ప్రస్తావించారు. ఖర్గే, ఏప్రిల్ 11నే ప్రధాని మోదీకి లేఖ రాసి డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టే ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సరైన సంప్రదింపులు లేకుండా రాజ్యాంగ సవరణ బిల్లును ముందుకు నెట్టే ప్రయత్నం చేయొద్దని కూడా ఆయన హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. ఏప్రిల్‌లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఇండియా కూటమి బలహీనపడింది. మొత్తం 22 ఎంపీలు ఉన్న మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్‌లో పెద్ద చీలిక వచ్చింది. వారిలో 20 మంది ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వైపు వెళ్లారు. అదే సమయంలో, ఇండియా కూటమిలో ముఖ్యమైన భాగస్వామి డీఎంకే కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి నుంచి విడిపోయింది. ఈ క్రమంలోనే.. మరోసారి డీలిమిటేషన్ బిల్లును మరోసారి కేంద్రం తెరపైకి తీసుకొస్తున్నట్లు సమాచారం.
దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరం
డీలిమిటేషన్ వల్ల ఉత్తర భారత రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందని, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఇండియా కూటమి వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఇండియా కూటమి బిల్లును వ్యతిరేకించింది. రాజ్యాంగం (128వ సవరణ) చట్టం-2023 నారీ శక్తి వందన్ చట్టంగా పిలుస్తున్న మహిళా రిజర్వేషన్ చట్టం-లోక్‌సభ, శాసనసభలలో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు కేటాయించాలని నిర్దేశిస్తున్నది. అయితే, తదుపరి జనగణన తర్వాత డీలిమిటేషన్ పూర్తయినప్పుడే ఆ నిబంధన అమలవుతుందని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు.
