- దిల్జిత్ కచేరీని పేల్చేస్తామంటూ ఈ మెయిల్స్
ముంబై: ముంబైలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. మేయర్ కార్యాలయం, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’, పంజాబీ సింగర్ దిల్జిత్ దోసాంజ్ కచేరీని పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఈమెయిల్స్ పంపారు. మేయర్ ఆఫీస్‌పై దాడి చేస్తామని, అమితాబ్ బంగ్లాపై గతంలో ఇచ్చిన బెదిరింపును మళ్లీ పంపించారు. దిల్జిత్ సంగీత కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ఐఫోన్ బాంబుతో దాడి చేస్తామని హెచ్చరించారు.
ఈమెయిల్స్‌తో అప్రమత్తమైన ముంబై పోలీసులు, భద్రతా సంస్థలు వెంటనే తనిఖీలు చేపట్టాయి. బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక ఆధారాలతో పంపిన వ్యక్తుల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
