రాయపర్తి, వెలుగు: పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన ఓ రైస్ మిల్లుకు చెందిన ఐదుగురు పార్ట్నర్లను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించిన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరులో గురువారం జరిగింది. వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, ఎస్సై ముత్యం రాజేందర్ వివరాల ప్రకారం.. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొండూరులోని పరమేశ్వరీ రైస్ ఇండస్ట్రీస్‌కు కస్టమ్ మిల్లింగ్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ ధాన్యాన్ని అప్పగించారు. 2022– -23 వానకాలం సీజన్లో 467.426 టన్నులు, 2023– -24 సీజన్లో 468.708 టన్నుల ధాన్యాన్ని మిల్లుకు కేటాయించారు.
మొత్తం ధాన్యం విలువ సుమారు రూ.3.03 కోట్లు. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ రూపంలో తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. అయితే, ఈ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి, వచ్చిన సొమ్మును ఐదుగురు భాగస్వాములు పంచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై వరంగల్ జిల్లా సివిల్ సప్లైస్మేనేజర్ బి.సంధ్యారాణి ఫిర్యాదు మేరకు ఆఫీసర్లు విచారణ చేపట్టారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో మెస్సర్స్ పరమేశ్వరీ రైస్ ఇండస్ట్రీస్ భాగస్వాములైన చిర్ర ఉపేంద్ర, పుల్ల ఎల్లగౌడ్, ఆవుల కేశవరెడ్డి, అలువాల ప్రభాకర్‌రెడ్డి, వంగాల నర్సయ్యను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
