కాంగ్రెస్ నాయకులపై సస్పెన్షన్లు ఏకపక్షం..రద్దు చేయకుంటే ఖర్గే వద్దకు వెళ్తాం : కొయ్యూరు ఉప సర్పంచ్ లకవత్ సవేందర్

కాంగ్రెస్ నాయకులపై సస్పెన్షన్లు ఏకపక్షం..రద్దు చేయకుంటే ఖర్గే వద్దకు వెళ్తాం :  కొయ్యూరు ఉప సర్పంచ్ లకవత్ సవేందర్

పెద్దపల్లి, వెలుగు: సొంత పార్టీ ఎంపీ పాల్గొన్న సమావేశానికి హాజరైనందుకు మంథని నియోజకవర్గం కొయ్యూరు కాంగ్రెస్ నాయకులపై ఏకపక్షంగా చేసిన సస్పెన్షన్లు ఎత్తివేయాలని కొయ్యూరు ఉపసర్పంచ్ లకవత్ సవేందర్, మాజీ కో ఆప్షన్ మెంబర్ ఎండీ ఖలీముద్దీన్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి భూమయ్య డిమాండ్ చేశారు. పెద్దపల్లిని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో వారు మాట్లాడారు. ఇటీవల ఎంపీ గడ్డం వంశీకృష్ణ కొయ్యూరు ప్రభుత్వ పాఠశాలలో స్టూడెంట్స్ కు బ్యాగులు పంపిణీ చేస్తే ఆయనతో పాటు పాల్గొనడం నేరమా అని ప్రశ్నించారు. 

ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఫిర్యాదు కాపీ చూపించకుండా చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకే సస్పెండ్ చేసినట్లు పార్టీ మండలాధ్యక్షుడు పేర్కొన్నారని వారు గుర్తు చేశారు. ఈ వ్యవహారం పై ఇప్పటికే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. సస్పెన్షన్లు ఎత్తివేయనిపక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దృష్టికి తీసుకు వెళ్తామని  స్పష్టం చేశారు.