కోరుట్ల/గొల్లపల్లి, వెలుగు : అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వానికి రెండు కళ్లు అని, గిరిజన తండాలు, గూడాల డెవలప్‌కు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో రూ.13.10 కోట్లతో చేపడుతున్న బీటీ రోడ్ల పనులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కథలాపూర్, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లోని గిరిజన తండాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.19 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. టెండర్లు పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించి, షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు మాని పదేండ్లలో పేదలకు ఏం చేశారో చెప్పాలని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులకు సవాల్ విసిరారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కథలాపూర్ మండలంలో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి భూసేకరణకు రూ.80 కోట్లు కేటాయించామని తెలిపారు.
కాంగ్రెస్‌లో చేరికలు..
గొల్లపల్లి మండలం దమ్మన్నపేట సర్పంచ్ ముదాం గౌతమి జానారెడ్డి, ఆత్మకూరు సర్పంచ్ తదితరులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ అభివృద్ధిని ఆకాంక్షించి కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషకరమని, ఆ గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. అనంతరం రంగధాంపల్లి గ్రామంలో నర్మెట్ల మౌనిక, మహేశ్దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎద్దు శంకరయ్యను పరామర్శించారు. గొల్లపల్లి మార్కెట్ యార్డులో పాక్స్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
