- ఆరు గ్యారెంటీలు హామీ ఇచ్చి మోసం చేసిన రాహుల్‌కు రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కు లేదు
- నల్లజెండాలతో నిరసనలు తెలుపుతాం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
- కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని బీజేవైఎం శ్రేణులకు పిలుపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ ఒక బూటకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. బంగ్లాదేశ్, నేపాల్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో అస్థిరతను, అరాచకాన్ని సృష్టించిన ప్రోగ్రెసివ్ అలయన్స్, ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించడం ద్వారా దేశవ్యతిరేక శక్తుల కోసమే ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టుగా ఉందని ఆరోపించారు.
సల్మాన్ ఖుర్షీద్, శామ్ పిట్రోడా ఆధ్వర్యంలో ఎలాం టి విజన్ లేని రాహుల్ గాంధీ భజన చేయడానికే ఈ తంతు సాగుతోందని, ఇది భారత్ సమ్మిట్ కాదని, ముమ్మాటికీ యాంటీ-భారత్ సమ్మిట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రాతలు రాసే నార్వే జర్నలిస్టు హెల్లె లింగ్‌ను సదస్సుకు ఆహ్వానించడం కాంగ్రెస్ దేశ వ్యతిరేక బుద్ధికి నిదర్శనమని ఆయన విమర్శించారు. గురువారం నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌లో బీజేవైఎం యువ సంవాద్ కార్యక్రమం జరిగింది. దీనికి బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ హేమంగ్ జోషితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు.
ఆరు గ్యారెంటీల అమలు ఏమైంది?
తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరుతో ఆశ చూపి, ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువతను నట్టేట ముంచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి హైదరాబాద్‌లో అడుగుపెట్టే నైతిక హక్కే లేదని రాంచందర్ రావు అన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడ్తూ, భారత్ సమ్మిట్‌ను, రాహుల్ రాకను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసనలు చేపట్టాలని, కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని బీజేవైఎం కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
2024 ఎన్నికల్లో జరిగిన 1,100 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఏకంగా 850 గెలుచుకుంటే, కాంగ్రెస్ కేవలం 150 సీట్లకే పరిమితమైందని చెప్పారు. కేవలం సోషలిజం, కమ్యూనిజం, క్యాపిటలిజంల వల్ల దేశాలు అభివృద్ధి చెందవని, జాతీయవాదంతోనే దేశ పురోగతి సాధ్యమని అభిప్రాయపడ్డడారు. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు హేమంత్ జోషి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రపూరిత, అసత్య ప్రచారాలను యువత వాస్తవాలతో ఎండగట్టి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం యువతను పావులుగా వాడుకుంటూ, సమాజంలో అశాంతిని రేకెత్తించే ధోరణులను ఎక్కడికక్కడ చైతన్యంతో నిలదీయాలని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్, నేతలు పాల్గొన్నారు.
ఎఫ్ఎంజీలకు నెలకు రూ.29,792 స్టైపెండ్ ఇవ్వాలి
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎదుట 34 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఎఫ్ఎంజీ విద్యార్థులపై పోలీసులు కర్కశంగా లాఠీఛార్జ్ చేసి, అక్రమ కేసులు బనాయించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఖండించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో తనను కలిసిన విద్యార్థులకు పార్టీ తరఫున ఆయన సంపూర్ణ భరోసా కల్పించారు.
విదేశాల్లో వైద్య విద్య పూర్తిచేసి, ఎన్ఎంసీ నిర్వహించే కఠిన స్క్రీనింగ్ పరీక్షలో నెగ్గిన విద్యార్థులు స్థానిక ఇంటర్న్లతో సమానంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. స్థానిక హౌస్ సర్జన్లకు నెలకు దాదాపు రూ.30 వేల వరకుస్టైపెండ్ ఇస్తూ, ఎఫ్ఎంజీలకు కేవలం రూ.5 వేలే ఇవ్వడం తీవ్ర వివక్ష అని విమర్శించారు. న్యాయం అడిగితే చర్చలకు పిలవాల్సింది పోయి, దీక్షలు చేస్తున్న విద్యార్థులపై లాఠీలు ఝుళిపించి ఈడ్చిపారేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
