హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా రహదారుల నిర్మాణ రంగానికి చెందిన నిపుణులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హైదరాబాద్‌కు రానున్నారు. ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) 85వ వార్షిక సమావేశం ఈ నెల 19 నుంచి 22 వరకు మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరగనుంది. ఈ సమావేశంలో రహదారుల అభివృద్ధి, ఆధునిక నిర్మాణ పద్ధతులపై చర్చించనున్నారు. గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సదస్సు వివరాలను వెల్లడించారు. జాతీయ స్థాయి సమావేశానికి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. 'తెలంగాణ రైజింగ్' లక్ష్య సాధనలో మెరుగైన రహదారుల నిర్మాణం కీలకమని చెప్పారు.
సుస్థిర నిర్మాణాలు, డిజిటల్ టెక్నాలజీ, వాతావరణ మార్పులను తట్టుకునే రోడ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధ (ఏఐ), హైవే ఇంజినీరింగ్‌లో కొత్త ఆవిష్కరణలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. సదస్సులో 19 సాంకేతిక సమావేశాలతో పాటు భారీ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. రోడ్ల నిర్మాణ యంత్రాలు, సామగ్రి, సాఫ్ట్వేర్ తయారీ సంస్థలు తమ కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించనున్నాయి. నవంబర్ 19న ఐఆర్సీ 238వ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. 20న హైవే రీసెర్చ్ బోర్డు 90వ సమావేశం, పీడబ్ల్యూడీ ఉన్నతాధికారుల భేటీ, కౌన్సిల్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారు. 21న 85వ వార్షిక వ్యాపార సమావేశం, 22న 239వ కౌన్సిల్ సమావేశం జరుగుతాయి. చివరి రోజు ప్రతినిధుల కోసం రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన క్షేత్ర పర్యటనలు ఏర్పాటు చేశారు. ఆర్అండ్బీ శాఖ ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు.
