- ప్రజాప్రతినిధుల కోర్టులో వాంగ్మూలం నమోదు
బేగంబజార్, వెలుగు: కరోనా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. 2021లో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచార సమయంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదైంది.
ఈ కేసు విచారణలో భాగంగా గురువారం కోర్టుకు హాజరైన ముఖ్యమంత్రి సుమారు 40 నిమిషాల పాటు అక్కడే ఉండి, విచారణ అనంతరం బయటకు వెళ్లిపోయారు. సీఆర్‌పీసీ 313 కింద ట్రయల్ పూర్తయి జడ్జిమెంట్ ను రిజర్వ్ చేశారు. కేసు తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసిన న్యాయమూర్తి అదే రోజు తీర్పు వెలువరించనున్నట్లు సమాచారం.
2021 ఏప్రిల్ 11న నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి గ్రామంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. మాస్క్ ధరించనందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.
