- అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఎల్నినో ప్రభావంతో ఏర్పడే కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలేమిటో వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎల్నినో ప్రకృతి సహజంగా ఏర్పడే పరిస్థితి అని, దీనికి ప్రభుత్వాన్ని బాధ్యులను చేయలేమని పేర్కొంది. అయితే, భవిష్యత్తులో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు నీటి కొరత నివారణకు రూపొందించిన ప్రణాళికలు, అమలు చేస్తున్న చర్యల వివరాలతో పూర్తి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ డాక్టర్ చెరుకు సుధాకర్ మరొకరు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. శ్యామ్ కోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావులతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ..ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నారు. విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం రూపొందించిన ప్రణాళికలు, ప్రామాణిక కార్యాచరణ విధానాలు, కరవు అంచనా నివేదికలు, ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలను సమర్పించేలా ఆదేశించాలని కోరారు. రాష్ట్రంలోని 621 మండలాలకు గాను 365 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో తాగునీటి సమస్య తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని, మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేపట్టకపోవడం కూడా నీటి సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తోందని వాదించారు. బెంచ్ స్పందిస్తూ..నీటి కొరత నివారణకు తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను డిసెంబరు 9కి వాయిదా వేసింది.
