హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మహిళా వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబా విమర్శించారు. గురువారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన అల్కా లంబా పార్టీ మహిళా నేతలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలోని మహిళలపై ప్రధాని మోదీకి ఏమాత్రం గౌరవం, అభిమానం ఉన్నా వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు.
ఈ బిల్లును అమలు కాకుండా అడ్డుకునే ఉద్దేశంతోనే డీలిమిటేషన్ అంశంతో ముడిపెట్టి పార్లమెంట్లో ప్రవేశపెట్టారని ఆమె ఆరోపించారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లును విడిగా ప్రవేశపెట్టి, వెంటనే ఆమోదింపజేయాలని కోరారు. అనంతరం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అమలు చేస్తున్న మహిళా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అల్కా లంబా ఆదేశించారు.
