విశాఖపట్నం : విదేశీ విమాన తయారీ సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ ఏరోస్పేస్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా భారత్ కీలక అడుగులు వేస్తోంది. రాబోయే రెండేళ్లలో సొంతంగా పౌర విమానాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విశాఖపట్నంలో గురువారం జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కేవలం విమానాల తయారీకే పరిమితం కాకుండా, వాటి డిజైనింగ్ సామర్థ్యాన్ని కూడా దేశీయంగానే అభివృద్ధి చేసి, భారత్‌ను గ్లోబల్ ఏరోస్పేస్ హబ్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
రాబోయే దశాబ్ద కాలంలో 'ఉడాన్' పథకం కింద దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. 2026–27 నుంచి 2035–36 మధ్య 'మోడిఫైడ్ ఉడాన్' పథకం కోసం రూ.28,840 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుంది. ఇందులో భాగంగా చిన్న నగరాలు, మారుమూల ప్రాంతాలకు విమాన సేవలను విస్తరించడంతో పాటు 200 ఆధునిక హెలిప్యాడ్‌లను నిర్మించనున్నారు.
వీటితో పాటు పట్టణ, ప్రాంతీయ రవాణా కోసం ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు, వాణిజ్య వృద్ధికి ఎయిర్ కార్గో నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక శక్తిగా ఎదుగుతోందని, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలతో సంబంధాలను విస్తరించుకుంటోందని అన్నారు.
