ఏఐ ఆధారిత వ్యవసాయ సలహాలు..తెలంగాణలో భారత్ విస్తార్ సేవలు : మంత్రి తుమ్మల

ఏఐ ఆధారిత వ్యవసాయ సలహాలు..తెలంగాణలో భారత్ విస్తార్ సేవలు : మంత్రి తుమ్మల
  •     ఆరు కీలక సేవలు ఒకే వేదికపైకి.. 
  •     వ్యవసాయ శాఖ-ఎన్ఐఎస్జీ మధ్య ఒప్పందం..
  •     రైతుల ఖర్చు తగ్గించి ఆదాయం పెంచడమే లక్ష్యం: మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: ఇకపై సాగు సమస్యలపై ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్​(ఏఐ) ఆధారంగా రైతులకు తెలుగులోనే సలహాలు అందించే సౌకర్యాన్ని వ్యవసాయశాఖ కల్పించనుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘భారత్ విస్తార్’ను రాష్ట్రానికి అనుసంధానించి, ఆరు కీలక వ్యవసాయ సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. గురువారం సెక్రటేరియట్​లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో వ్యవసాయశాఖ, ఎన్ఐఎస్జీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. 

ఒకే వేదికపై ఆరు సేవలు..

భారత్ విస్తార్ ద్వారా ఒకే వేదికపై పంటల సాగు, వాతావరణ పరిస్థితులు, చీడపీడలు, తెగుళ్ల నివారణ, నేల ఆరోగ్యం, ఎరువుల వినియోగం, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాల వివరాలు రైతులకు అందనున్నాయి. రైతులు తమ సమస్యలను తెలుగులో మాట్లాడినా, టైప్ చేసినా ఏఐ ఆధారిత ‘భారతి’వాయిస్ అసిస్టెంట్ సమాధానాలు అందిస్తుంది. ఐకార్​, ఐఎండీ, నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్, అగ్రిమార్కెట్ నెట్ వంటి వ్యవస్థల సమాచారాన్ని అనుసంధానించి సూచనలు అందించనున్నారు. వాతావరణ మార్పులపై ముందస్తు సమాచారం అందించేందుకు వీలుంటుంది. తెగుళ్లు, చీడపీడలను ఫొటోల ద్వారా గుర్తించి నివారణ చర్యలు తెలుసుకునే సదుపాయం ఉంటుంది. సాయిల్ హెల్త్ కార్డులు, నేల పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగంపై సూచనలు పొందవచ్చు. వివిధ మార్కెట్లలో పంటల ధరలను తెలుసుకుని ఎక్కడ అమ్ముకుంటే ప్రయోజనకరంగా ఉంటుందో నిర్ణయం తీసుకోవచ్చు. పీఎం-కిసాన్, పంటల బీమా, కిసాన్ క్రెడిట్ కార్డు తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల అర్హతలు, దరఖాస్తుల స్థితి, లబ్ధి వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు.

నాలుగు మార్గాల్లో సేవలు అందించేందుకు ప్లాన్.. 

ప్రస్తుతం అందుబాటులో ఉన్న 155261 హెల్ప్లైన్ ద్వారా వాయిస్ బాట్ సేవలను, 15 నుంచి 21 రోజుల్లో రాష్ట్రస్థాయి వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ను, 45 నుంచి 60 రోజుల్లో వాట్సాప్ చాట్బాట్ సేవలు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు లభించిన తర్వాత తెలుగు వాయిస్ బాట్తో ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో స్మార్ట్ఫోన్ వినియోగించే రైతులతో పాటు సాధారణ ఫోన్ ఉన్నవారు సైతం వాయిస్ కాల్ ద్వారా వ్యవసాయ సలహాలు పొందవచ్చు. ఈ వ్యవస్థ అమలును నాలుగు దశల్లో చేపట్టనున్నారు. తొలిదశలో జాతీయ స్థాయిలో చాట్బాట్, వాయిస్ బాట్ సేవలను తెలుగులోకి తీసుకురానున్నారు. రెండో దశలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, స్థానిక వ్యవసాయ సమాచారాన్ని అనుసంధానిస్తారు. మూడో దశలో రైతుల దరఖాస్తులు, పథకాల లబ్ధి, చెల్లింపులు, ఫిర్యాదుల పరిష్కార స్థితిని తెలుసుకునే సదుపాయం కల్పిస్తారు. నాలుగో దశలో వ్యవసాయ శాఖ అనుమతించిన మరిన్ని వివరాలను అనుసంధానిస్తారు. ఇందుకోసం వ్యవసాయ శాఖ తరఫున నోడల్ అధికారిని నియమిస్తారు. స్థానిక భాషలో వాయిస్ ఆధారిత సేవలు అందుబాటులోకి రావడం చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనకరంగా మారనుంది. 

రైతుల ఖర్చు తగ్గించి ఆదాయం పెంచడమే లక్ష్యం
వ్యవసాయ రంగంలో టెక్నాలజీ విస్తృతంగా వినియోగించి సాగును మరింత లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం. వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం, పంట రకం, సాగు సమయం, చీడపీడల నివారణ, మార్కెట్ ధరలను విశ్లేషించి కచ్చితమైన సలహాలు అందించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో స్థానిక పరిస్థితులు, పంటల వైవిధ్యానికి అనుగుణంగా భారత్ విస్తార్ను రూపొందించి రైతులకు మరింత ప్రయోజనం కలిగేలా చర్యలు చేపడతాం. 

(-వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు)