వరంగల్‍: ‘కుడా’ కాంప్లెక్స్ కిరాయిల ఎగవేత..లీజుదారుడికి లాభాలు.. సర్కారుకు నష్టాలు!

వరంగల్‍: ‘కుడా’ కాంప్లెక్స్ కిరాయిల ఎగవేత..లీజుదారుడికి లాభాలు.. సర్కారుకు నష్టాలు!
  •     గ్రేటర్‍ వరంగల్​లో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిన ప్రభుత్వ సంస్థ
  •     2022లో సొంత పార్టీ కార్పొరేటర్‍కు పదేండ్ల లీజుకు ఇచ్చిన బీఆర్‍ఎస్‍ సర్కార్‍ 
  •     లీజుదారు రూల్స్​కు విరుద్ధంగా ఎక్కువ ధరలకు సబ్‍ లీజ్‍
  •     నెలనెలా కోట్లాదిగా కిరాయిలు తీసుకుంటూ సర్కారుకు అద్దె ఎగవేత
  •     జీతాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న స్పోర్ట్స్​ఆఫీసర్లు

వరంగల్‍, వెలుగు: ఓరుగల్లు నడిబొడ్డున కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చుచేసి కట్టిన కమర్షియల్‍ కాంప్లెక్స్​ సర్కారుకు ఆదాయం సమకూర్చాల్సింది పోయి ప్రైవేట్‍వ్యక్తుల ప్రయోజనాలకు వేదికయ్యింది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ పలుకుబడితో పదేండ్ల లీజు దక్కించుకున్న ఓ మాజీ కార్పొరేటర్​సర్కారుకు చెల్లించాల్సిన కనీస అద్దె కట్టకుండా ఆఫీసర్లకు చుక్కలు చూపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అద్దె బకాయిల వసూలు కోసం జిల్లా కలెక్టర్‍ సదరు కాంప్లెక్స్​ను సీజ్‍ చేసినా పైరవీలు, గడువు అంటూ తాళాలు తెరిపించుకున్నాడు. అద్దె బకాయిలు రాక కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍అథారిటీ (కుడా) అనుకున్న లక్ష్యం నెరవేరట్లేదు. 

ప్రభుత్వ 'స్పోర్ట్స్' భూమి.. కుడా కాంప్లెక్స్ 

ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో హనుమకొండ సిటీ బస్టాండ్‍ ప్రాంతం నడిబొడ్డుగా ఉంటుంది. ఇక్కడ జంక్షన్‍లో జవహర్‍లాల్‍ నెహ్రూ స్టేడియం పరిధిలో ఉండే స్పోర్ట్స్​డిపార్టుమెంట్‍కు చెందిన ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 2011 లో కుడా సుమారు రూ.4 కోట్లతో జీ ప్లస్‍ త్రీ పద్ధతిలో భారీ కమర్షియల్‍ కాంప్లెక్స్​నిర్మించింది. గ్రౌండ్‍ ఫ్లోర్‍ తోపాటు మొదటి, రెండు అంతస్తులను కమర్షియల్‍గా అద్దెలకు ఇచ్చి ఆదాయం సమకూర్చుకోవాలని భావించారు. మూడో అంతస్తులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా వసతులు, ఇండోర్‍ బ్యాడ్మింటన్‍ కోర్టు, జిమ్, ఇతర స్పోర్ట్స్ అభివృద్ధికి వినియోగించాలని భావించింది. అయితే అనుకున్నవాటి కంటే మరిన్ని నిధులు ఎక్కువ ఖర్చుచేసి కాంప్లెక్స్​నిర్మాణం పూర్తిచేశారు.

గులాబీ పార్టీ లీడర్‍ కు పదేండ్ల లీజు.. 

బీఆర్‍ఎస్‍ ప్రభుత్వ హయాంలో కేటీఆర్‍ మున్సిపల్‍శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ కాంప్లెక్స్​నిర్మాణం పూర్తయ్యింది. ప్రారంభంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను పక్కకుపెట్టి సొంత ప్లాన్‍ అమలు చేశారు. ఏండ్ల తరబడి కాంప్లెక్స్​ను నిరుపయోగంగా ఉంచారు. 2022 మొదట్లో అప్పటి లోకల్​ ఎమ్మెల్యే అనుచరుడిగా ఉన్న ఓ బీఆర్ఎస్​ కార్పొరేటర్​కు పదేండ్ల లీజుకు ఇచ్చారు. ప్రతినెలా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల అద్దెలు రావాల్సినచోట కేవలం రూ.10 లక్షలకే కమర్షియల్‍ కాంప్లెక్స్​ను గంపగుత్త అద్దెగా నిర్ణయించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు, తెరవెనుక వ్యవహారాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

లీజ్‍ రూల్స్​ బ్రేక్‍.. 

కాంప్లెక్స్​ లీజు దక్కించుకున్న సదరు మాజీ కార్పొరేటర్​ లీజ్​రూల్స్​బ్రేక్​ చేశాడు. బడా కార్పొరేట్‍ హాస్పిటల్స్, డయాగ్నస్టిక్‍ సెంటర్లు, హోటళ్లకు పెద్ద మొత్తం ధరలతో సబ్‍ లీజ్‍ ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. కాగా, సదరు లీజుదారుడు గడిచిన రెండేళ్లుగా 'కుడా'కు చెల్లించాల్సిన కనీస లీజ్‍ అద్దె డబ్బులు సుమారు రూ.2.40 కోట్లకుపైగా చెల్లించలేదని ఆఫీసర్లు చెబుతున్నారు. 

సకాలంలో అద్దె కట్టాలి.. 
గ్రేటర్‍ జవహర్‍లాల్‍ నెహ్రూ స్టేడియం, స్పోర్ట్స్​ అభివృద్ధి పనులకు ఆర్థికంగా ఆధారంగా ఉంటుందనే కుడా కాంప్లెక్స్​ను లీజ్‍ ఇచ్చారు. దానిని దక్కించుకున్న వ్యక్తి ఎన్నిసార్లు చెప్పినా సకాలంలో లీజ్‍ అద్దె కట్టట్లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ అద్దె డబ్బులపై ఆధారపడి జీతాలు తీసుకునేవారు ఇబ్బందులు పడ్తున్నారని మా దృష్టికి రాగా, ఈ సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలని సూచించాం. 
(-నాయిని రాజేందర్‍రె డ్డి, వరంగల్​పశ్చిమ ఎమ్మెల్యే)

కాంప్లెక్స్​ సీజ్‍ చేసినా తీరు మారలే..
కుడా కాంప్లెక్స్​లీజ్‍ దక్కించుకున్న మాజీ కార్పొరేటర్‍ అద్దె కట్టకుండా ఆఫీసర్లను ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో విషయం తెలిసిన జిల్లా ఉన్నాతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ ఏడాది మే 23న హనుమకొండ కలెక్టర్‍, జీడబ్ల్యూఎంసీ స్పెషల్‍ ఆఫీసర్‍ చాహత్‍ బాజ్‍పాయ్‍ కాంప్లెక్స్​లోని పలు షెట్టర్లకు తాళాలు వేసి సీజ్‍ చేశారు. దీంతో అందులో వ్యాపారాలు నిర్వహించే ప్రధాన సంస్థలు ఇబ్బందులు పడ్డాయి. కాంప్లెక్స్​ సీజ్​ కావడంతో రంగంలోకి దిగిన లీజుదారుడు కొంతమేర అద్దె చెల్లించి, త్వరలోనే మిగతా అద్దెకు సంబంధించి చెక్కులు ఇచ్చారు. తీరాచూస్తే అవి బ్యాంకులో చెల్లుబాటు కాలేదని ఆఫీసర్లు తలలు పట్టుకున్నారు. దీంతో బకాయిల వసూలు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. కాగా, కుడా కాంప్లెక్స్​అద్దెలతో స్పోర్ట్స్​ డిపార్టుమెంట్​లో పనిచేసే కోచ్‍లు, సిబ్బందికి జీతాలు ఇవ్వాల్సి ఉండగా కొన్ని నెలలుగా వారికి ఇబ్బందులు తప్పట్లేదని ఆఫీసర్లు చెప్తున్నారు.