- ప్రిలిమ్స్‌కు ఎంపికయ్యాక ప్రభుత్వం, సింగరేణి నుంచి లక్ష చొప్పున ఆర్థిక సాయం
- ఇంటర్వ్యూకు వెళ్లేవారికి అదనంగా మరో రూ.లక్ష చొప్పున ప్రకటించిన సింగరేణి
- త్వరలో స్పెషల్ మాక్ ఇంటర్వ్యూల నిర్వహణకు ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు:తెలంగాణ యువత సివిల్స్ కలలను సాకారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థల సంయుక్త కృషి అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. రాష్ట్రం నుంచి వీలైనంత ఎక్కువ మంది సివిల్స్ సాధించేలా ప్రోత్సహించే లక్ష్యంతో అమలు చేస్తున్న ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం అరుదైన మైలురాయిని చేరుకుంది. తాజాగా వెలువడిన సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందిన 31 మంది అభ్యర్థులు తుది ఇంటర్వ్యూకు ఎంపికై సత్తా చాటారు.
158 మంది అకౌంట్లలో రూ.1.58 కోట్లు..
ఈ పథకం కింద ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మెయిన్స్ కోచింగ్ కోసం ప్రభుత్వం, సింగరేణి సంస్థల ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించిన సంగతి తెలిసిందే. సింగరేణి తన కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్సార్) నిధుల నుంచి ఈ ఏడాది 158 మందిని ఎంపిక చేసి, రూ.1.58 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ ఆర్థిక భరోసాతో కఠినమైన మెయిన్స్ పరీక్షను విజయవంతంగా ఎదుర్కొని 31 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు.
డిప్యూటీ సీఎం భట్టి అభినందనలు
ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. తుది దశలోనూ వీరంతా విజయం సాధించి, జాతీయ స్థాయిలో రాష్ట్రానికి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇంటర్వ్యూకు ఎంపికైన ప్రతి ఒక్కరికీ అదనంగా మరో రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు సింగరేణి ప్రకటించింది. అలాగే, ఢిల్లీ స్థాయి నిపుణులతో స్పెషల్మాక్ ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
జిల్లాల వారీగా ప్రాతినిధ్యం ఇలా..
ఈసారి సివిల్స్‌కు ఎంపికైన 31 మందిలో అత్యధికంగా వరంగల్ జిల్లా నుంచి ఆరుగురు ఉన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి నుంచి నలుగురు, హైదరాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి ముగ్గురు, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున, ఆదిలాబాద్, నారాయణపేట, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఎంపికయ్యారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే వీరిలో 18 మంది ఓబీసీ, 8 మంది జనరల్, ముగ్గురు ఎస్సీ, ఇద్దరు ఎస్టీ అభ్యర్థులు ఉన్నట్లు సింగరేణి ప్రకటించింది.
