- సోలార్ ఎనర్జీ పెరగడంతో తగ్గిన
- బొగ్గు, నేచురల్ గ్యాస్ దిగుమతులు
న్యూఢిల్లీ: మన దేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ పెరగడంతో పెద్ద మొత్తంలో ఫారిన్ రిజర్వ్‌లు ఆదా అవుతున్నాయి. 2011 నుంచి 2025 మధ్య కాలంలో బొగ్గు, నేచురల్ గ్యాస్ దిగుమతులపై ఖర్చు చేయాల్సిన సుమారు 100 బిలియన్ డాలర్ల (రూ.9.50 లక్షల కోట్ల) కు పైగా ఫారెక్స్‌ను భారత్ ఆదా చేయగలిగింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) విడుదల చేసిన 'ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ మార్కెట్ రిపోర్ట్' ఈ కీలక విషయాలను వెల్లడించింది. విదేశీ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, ఇంధన భద్రతను భారత్ సాధిస్తోంది. సోలార్, విండ్, బయో ఎనర్జీ రంగాలు ఇందుకు కీలకంగా మారాయి.
2030 నాటికి రూ.22.6 లక్షల కోట్లు!
భారత్ తన గ్రీన్ ఎనర్జీ కెపాసిటీని నిరంతరం పెంచుకుంటున్న నేపథ్యంలో, ఈ దశాబ్దం చివరి నాటికి భారత్ ఆదా చేసే ఫారెక్స్ అమౌంట్ రెట్టింపు అవుతుందని అంచనా. 2030 నాటికి బొగ్గు, గ్యాస్ దిగుమతుల రూపంలో దాదాపు 240 బిలియన్ డాలర్లు (సుమారు రూ.22.80 లక్షల కోట్లు) ఆదా అవుతాయని ఐఈఏ పేర్కొంది. ఒకవేళ 2010 తర్వాత ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాకపోయుంటే, కేవలం 2025 ఒక్క ఏడాదిలోనే అదనంగా 11 కోట్ల టన్నుల బొగ్గు దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది.
2030 నాటికి ఏటా 35 బిలియన్ డాలర్లకు (రూ.3.32 లక్షల కోట్ల) ను ఆదా చేస్తామని అంచనా. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ చేసిన మొత్తం నాన్-కోకింగ్ బొగ్గు, గ్యాస్ దిగుమతుల ఖర్చు కంటే ఎక్కువని ఐఈఏ రిపోర్ట్ పేర్కొంది. గత దశాబ్ద కాలంలో భారత రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యం దాదాపు నాలుగు రెట్లు పెరిగి 2026 నాటికి 300 గిగావాట్ల మైలురాయిని దాటింది. ఇందులో 168 గిగావాట్ల సోలార్, 38 గిగావాట్ల విండ్, 12 గిగావాట్ల బయో ఎనర్జీ సామర్థ్యం ఉంది. హైడ్రో, నూక్లియర్ ఎనర్జీ నుంచి మిగిలిన కరెంట్ ఉత్పత్తి అవుతోంది.
