సిద్దిపేట రూరల్, వెలుగు : కేసీఆర్ గెలవాలని తెలంగాణ మళ్లీ వెలగాలని యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, మూడేండ్లలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. గురువారం సిద్దిపేటలో రూరల్ మండలానికి కొత్తగా ఎన్నికైన విద్యార్థి విభాగం గ్రామ కమిటీ కార్యవర్గాన్ని ఆయన సన్మానించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఫీజు రియింబర్స్ మెంట్ ఇవ్వక విద్యార్థులను సీఎం మోసం చేస్తున్నాడని ఆరోపించారు. బాండ్ పేపర్ రాసిచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చేయలేదని విమర్శించారు.
అనంతరం సిద్దిపేట క్యాంప్ ఆఫీస్లో శ్రీరామ్ గ్రూప్స్ ఆధ్వర్యంలో జరిగిన ‘చదువుకో తెలంగాణ’ పోటీల్లో విజేతలుగా నిలిచిన టెన్త్ క్లాస్ విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు. సిద్దిపేట క్రికెట్ స్టేడియంలో అండర్ –19 తెలంగాణ రాష్ట్ర క్రికెట్ మ్యాచ్ లను ఆయన ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట రూరల్ మండలం తోర్నాలలో సర్పంచ్ అర్వపల్లి పద్మాదేవి గోపీనాథ్ రెడ్డి, ఉప సర్పంచ్ శీలం ప్రవీణ్ తో కలిసి సీసీ కెమెరాలు ప్రారంభించారు.
