- పోలీసులకు ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో వార్నింగ్ వచ్చినట్లు ఆ పార్టీ తిలక్నగర్ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విదేశీ లింకులున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిని అంటూ ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి, వాట్సాప్ మెసేజ్ పంపినట్లు తెలిపిన ఆయన ఆ సమాచారాన్ని ఢిల్లీ పోలీసులకు అందించారు. ఈ విషయమై నవంబర్ 6న పంజాబ్‌లోని మొహాలి పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేసిన ఆప్ఎమ్మెల్యే.. రూ.7 కోట్లు చెల్లించకపోతే అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుమార్తె హర్షితను చంపేస్తామని ఫోన్‌చేసిన దుండగుడు బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేజ్రీవాల్, ఆయన కుటుంబానికి తగిన భద్రత కల్పించాలని జర్నైల్ సింగ్ కోరారు. ఈ ఘటనపై మొహాలి పోలీసులు బీఎన్ఎస్, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపులకు ఉపయోగించిన మొబైల్ నంబర్ ఆధారంగా కాల్ రికార్డులు, ఐపీ లాగ్స్, లొకేషన్ డేటాను పరిశీలిస్తున్నారు.ప్రస్తుతం పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉండగా, మరికొద్ది నెలల్లోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.
