- జర్నలిస్టుల దీపావళి మిలన్‌లో ప్రధాని మోదీ
- దేశ సక్సెస్ స్టోరీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలె
- ఒకప్పుడు ఇదే ఆఫీసులో అతిథుల కోసం కుర్చీలు
- సర్దానంటూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న పీఎం
- 12 ఏండ్లలో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డరు
- రైల్వేను 100 శాతం విద్యుదీకరించినట్టు ప్రధానమంత్రి వెల్లడి
న్యూఢిల్లీ: ప్రెస్ రిలీజ్ ల కాలం చెల్లిందని..ఇప్పుడంతా ఇన్‌స్టా రీల్స్, పాడ్‌కాస్ట్‌ల జమానా నడుస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశం సాధిస్తున్న ప్రగతిని, సక్సెస్ స్టోరీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత కృషి చేయాలని మీడియాకు పిలుపునిచ్చారు. సామాజిక ప్రాధాన్యత కలిగిన అంశాలు, జాతీయ ఐక్యతను పెంచే వార్తలకు ప్రాధాన్యత ఇస్తూ వికసిత్ భారత్ ప్రయాణంలో మీడియా భాగస్వామి కావాలని..ఇదీ ఒక రకమైన దేశసేవేనని తెలిపారు. గురువారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జర్నలిస్టుల కోసం నిర్వహించిన 'దీపావళి మిలన్' కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన దేశ అభివృద్ధి, పేదరిక నిర్మూలన, మీడియా పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అశోక రోడ్ లోని పాత ఆఫీసులోనూ గతంలో ‘దీపావళీ మిలన్’ జరిగేదని మోదీ గుర్తుచేసుకున్నారు. ఆ కార్యక్రమాల్లో తాను కుర్చీలు సర్దే వాడినని గెస్ట్ లను రిసీవ్ చేసుకునే బాధ్యతలు నిర్వర్తించినట్లు చెప్పారు. అలా ఆ రోజుల నుంచే తనకు మీడియాతో సుదీర్ఘ సంబంధం ఉందన్నారు. గుజరాత్ సీఎంగా తనను హైకమాండ్ ఎంపిక చేసిందనే వార్తను కూడా మీడియా మిత్రుల ద్వారానే తెలిసిందన్నారు. ఆ రోజుల్లో కెమెరాలు తక్కువగా ఉన్నా... సంబంధాలు బలంగా ఉండేవని గుర్తు చేసుకున్నారు.
పత్రికా ప్రకటనల నుంచి నేడు ఇన్ స్ట్రాగ్రామ్ రీల్స్, పాడ్‌కాస్ట్‌ల వరకు మీడియాలో భారీ మార్పులు చూస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లే ఓబీ వ్యాన్‌ల స్థానాన్ని భర్తీ చేశాయన్నారు. వార్తా ప్రపంచంలో అసాధ్యం అంటూ ఏదీ ఉండదన్నారు. న్యూస్, న్యూస్ రూమ్ కు తేడా ఉందని... సంక్షోభ, విపత్తు సమయాల్లోనూ ఫీల్డ్ జర్నలిస్ట్‌లు కుటుంబాల్ని వదిలి ప్రమాదాలకు ఎదురుగా వెళ్తారని మోదీ పేర్కొన్నారు. యువతను డ్రగ్స్ బారినుంచి కాపాడేందుకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మీడియాకు మోదీ విజ్ఞప్తి చేశారు.
2047 నాటికి అభివృద్ధి దేశంగా భారత్
గడిచిన 12 ఏండ్లల్లో దేశంలో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని తెలిపారు. ఇందుకు సంబంధించి గత నెల విడుదలైన ప్రపంచ బ్యాంకు 'పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్' నివేదికను గుర్తుచేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం..2011 నుంచి 2023 మధ్య కాలంలో సుమారు 49.6 కోట్ల మంది ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తి పెరిగిందని..వారు పేదరికం నుంచి బయటపడి మెరుగైన జీవన స్థాయికి చేరుకున్నారని వివరించారు. దేశంలో పేదరికం రేటు 27.1 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గిందని చెప్పారు.
గతంలో కేవలం 'గరీబీ హఠావో' నినాదాలు మాత్రమే వినిపించేవని.. తమ ప్రభుత్వం మాత్రం వాస్తవ రూపంలో పేదరికాన్ని తగ్గించిందని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి వందేండ్లు పూర్తయ్యే 2047 నాటికి భారత్ కచ్చితంగా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు కనీసం మట్టి రోడ్డు అయినా వేయాలని ప్రజల నుంచి వినతిపత్రాలు వచ్చేవని..నేడు దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం, రైల్వేల పూర్తిస్థాయి విద్యుదీకరణ జరుగుతున్నాయని తెలిపారు.
రైల్వేను 100 శాతం విద్యుదీకరించాం...
దేశంలో 1930 నుంచి 2014 వరకు దాదాపు 90 ఏండ్లలో కేవలం 30 శాతం మాత్రమే రైల్వే లైన్ల విద్యుద్దీకరణ జరిగిందని ప్రధాని మోదీ విమర్శించారు. కానీ.. తమ పన్నెండేండ్ల బీజేపి పాలనలో రైల్వే ను 100 శాతం విద్యుదీకరించినట్లు వెల్లడించారు. గత దశాబ్ధ కాలంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల పంపిణీ వేగాన్ని కాంగ్రెస్ పాలనతో పోల్చి చెప్పారు. ఒకప్పుడు దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉండి, పూర్తి కావడానికి తరతరాలు పట్టేవిగా భావించిన జాతీయ ప్రాజెక్టులు ఇప్పుడు వేగంగా చివరి దశకు చేరుకున్నాయన్నారు. చంద్రయాన్, చీనాబ్ నదిపై ఎత్తయిన రైల్వే లైన్, యూపీఐ వంటి విప్లవాత్మక మార్పులను తమ ప్రభుత్వమే తెచ్చిందని మోదీ వెల్లడించారు.
దేశ రక్షణ బలగాలతో మోదీ దీపావళి: నితిన్ నబీన్
దీపావళి పర్వదినాన్ని దేశ ప్రజలు ఇండ్లలో జరుపుకుంటే.. ప్రధాని మోదీ దేశాన్ని రక్షిస్తోన్న సైనికులతో జరుపుకుంటున్నారని బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ అన్నారు. ఈ ఏడాది నక్సలిజం నిర్మూలనలో కీలక పాత్ర పోశించిన పారా మిలటరీ బలగాలతో దీపావళీ జరుపుకున్నారని చెప్పారు. దేశ పండుగలు, సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వానికి అంతర్జాతీయంగా గుర్తింపు పెరుగుతుందన్నారు. వాటిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లడంలో మోదీ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని చెప్పారు. విశ్వవ్యాప్తంగా ‘యోగా’ లాగే... అంతర్జాతీయంగా దీపావళి పండుగకు మోదీ గుర్తింపు తెస్తున్నారని నబీన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా,ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తదితరులు పాల్గొన్నారు.
