- రాచకొండ మొదటి సీపీగా సుదీర్ఘ సేవలు
హైదరాబాద్‌సిటీ, వెలుగు : హైదరాబాద్ నగర నూతన సీపీగా వస్తున్న మహేశ్ భగవత్ కు మానవత్వ వాదిగా పేరుంది. శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, అణగారిన వర్గాలు, బాధితులు, నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపడానికి ఆయన చేసిన కృషికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రెండు దశాబ్దాలుగా వేలాది మంది మహిళలు, చిన్నారులను వ్యభిచార కూపాల నుంచి, బలవంతపు వెట్టిచాకిరీ నుంచి కాపాడారు.
దీనికి గాను ఆయనకు 2017లో యూఎస్ డిపార్ట్‌మెంట్‌ఆఫ్ స్టేట్ నుంచి ప్రతిష్టాత్మక ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ రిపోర్ట్ హీరోస్ అవార్డు లభించింది. ఈ గౌరవం పొందిన మూడో భారతీయ ఐపీఎస్ అధికారిగా నిలిచారు. - విధి నిర్వహణలో చూపిన ధైర్యసాహసాలకు, విశిష్ట సేవలకు 2004లో గ్యాలంట్రీ, 2011లో మెరిటోరియస్ సర్వీస్, 2022లో విశిష్ట సేవా పతకం అందుకున్నారు.
వినూత్న ఆలోచన..వర్క్‌సైట్ స్కూల్స్
తెలంగాణలోని ఇటుక బట్టీల్లో పనిచేసే ఒడిశా వలస కార్మికుల పిల్లలను వెట్టిచాకిరీ నుంచి విడిపించడమే కాకుండా, వారు చదువుకునేందుకు వర్క్సైట్స్స్కూల్స్ఏర్పాటు చేయించారు. ఒడిశా నుంచే ప్రత్యేకంగా టీచర్లను రప్పించి వారి సొంత భాష (ఒడియా)లో చదువు చెప్పించారు. అలాగే, మధ్యాహ్న భోజనం అందేలా కృషి చేశారు.
లొంగిపోయిన మావోయిస్టులకు అండ
ఆదిలాబాద్ ఎస్పీగా ఉన్నప్పుడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు చేరువయ్యేందుకు చేపట్టిన ‘పోలీస్ మీ కోసం’, నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడు చేపట్టిన ‘ఆసరా’ ప్రాజెక్టులకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ఆదిలాబాద్ ఎస్పీగా ఉన్న టైంలో లొంగిపోయిన ఒక మావోయిస్టు చదువుకోవాలనే కోరికను గౌరవించి, స్వయంగా పూచీకత్తు ఇచ్చి ఇంజినీరింగ్ కాలేజీలో సీటు ఇప్పించారు.
ఆ వ్యక్తి తర్వాత ఎంటెక్ పూర్తి చేసి ప్రొఫెసర్‌గా స్థిరపడ్డారు. నల్గొండ జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు, వ్యభిచార వృత్తిలో ఉన్న కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి, యువతకు సెక్యూరిటీ గార్డులుగా శిక్షణ ఇప్పించి దారి చూపించారు.
నిరుద్యోగులకు అండ
ఆర్థిక స్థోమత లేని వేలాది మంది సివిల్స్ అభ్యర్థులకు ఆయన వాట్సాప్ గ్రూపులు, ఆన్‌లైన్ సెషన్ల ద్వారా ఉచితంగా మెటీరియల్, ఇంటర్వ్యూ గైడెన్స్ అందిస్తున్నారు. ఆయన గైడెన్స్‌లో ఇప్పటివరకు వందలాది మంది అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లుగా ఎంపికయ్యారు.
రాచకొండకు మొదటి సీపీగా..
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు మొదటి కమిషనర్‌గా ఆయన సుదీర్ఘ సేవలందించారు. 2023లో సీఐడీ ఏడీజీగా, ఆ తర్వాత రైల్వేస్, రోడ్డు భద్రత విభాగం ఏడీజీగా పనిచేశారు. కెరీర్ ప్రారంభంలో మణిపూర్‌లో సేవలందించారు.
