- నాగర్‌కర్నూల్ ఇరిగేషన్ ఆఫీసర్ పై అవినీతి ఆరోపణలు
- ఏకకాలంలో 10 ప్రాంతాల్లో ఏసీబీ దాడులు
- 50 తులాల బంగారం, భారీగా ఆస్తులు సీజ్
హైదరాబాద్, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులతో ఇరిగేషన్ అండ్ క్యాడ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ) రాగిడి సత్యనారాయణ ఇండ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ భైరామల్‌గూడలోని మాధవరం సెరెనిటీ గేటెడ్ కమ్యూనిటీలోని నివాసంతోపాటు నాగర్‌కర్నూల్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న కార్యాలయం సహా 10 ప్రాంతాల్లో గురువారం ఏకకాలంలో దాడులు చేసింది. ఈ సోదాల్లో దాదాపు రూ.7 కోట్లు విలువైన ఆస్తులను గుర్తించింది. వీటి విలువ బహిరంగ మార్కెట్ లో రూ.70 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
10 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు..
భైరామల్‌గూడలోని సత్యనారాయణ నివాసంలో 50 తులాల బంగారాన్ని ఏసీబీ స్వాధీనం చేసుకుంది. బంగారు ఆభరణాలతోపాటు బ్యాంకులో రూ.20 లక్షలు డిపాజిట్లు గుర్తించారు. వనపర్తిలో 25 ఎకరాల వ్యవసాయ భూమి, ఫామ్‌హౌస్, కుటుంబ సభ్యుల పేరిట వివిధ ప్రాంతాల్లో 9 ఓపెన్ ప్లాట్లు, తుక్కుగూడలో విల్లా, కర్మాన్‌ఘట్‌లో మూడంతస్తుల బిల్డింగ్, నాగోల్ రాక్ టౌన్ కాలనీలో రెండంతస్తుల భవనం ఉన్నట్లు గుర్తించారు.
వీటితోపాటు నాలుగు కార్లు, ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.7 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్‌లో దీని విలువ పది రెట్లు అంటే సుమారు రూ.70 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. సత్యనారాయణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ చలపతి వెల్లడించారు.
ఇరిగేషన్‌లో భర్త, విద్యుత్ సౌధలో భార్య..
2005లో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజినీరుగా సత్యనారాయణ చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లా క్యాడ్ డీఈఈగా విధులు నిర్వహిస్తున్నారు. సత్యనారాయణ భార్య విద్యుత్ సౌధలో ఏడీగా పనిచేస్తున్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతోపాటు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదులు అందాయి. దీంతో సత్యనారాయణపై ఏసీబీ అధికారులు రెండు నెలలుగా నిఘా పెట్టారు. ఆయన సర్వీస్ వివరాలతోపాటు జీతభత్యాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు సేకరించారు.
