ఎన్ని ఇబ్బందులున్నా ఇందిరమ్మ ఇండ్లు ఆగవు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఎన్ని ఇబ్బందులున్నా ఇందిరమ్మ ఇండ్లు ఆగవు :  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇందిరమ్మ ఇండ్ల పథకం ఆగదని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం లక్షల కోట్ల అప్పు మా నెత్తిన పెట్టి పోయిందని గుర్తుచేశారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్దేవుర్పల్లిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులకు మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తో కలిసి పొంగులేటి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ టవర్ల నిర్మాణాలను వచ్చే దీపావళి కల్లా పూర్తి చేస్తామన్నారు. 

వచ్చే పండుగను ఇందిరమ్మ ఇండ్లలో జరుపుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. "మరో మూడు విడతల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం. క్యూర్​పరిధిలోని 23 నియోజకవర్గాల్లో ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా, ఎలాంటి భేదాలు లేకుండా చేపడుతున్నాం. గత పాలకులు పేదల ఇండ్ల నిర్మాణంలో సొల్లు పురాణం చెప్పారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు ప్రధాన హామీలను నెరవేరుస్తున్నాం" అని మంత్రి తెలిపారు. అనంతరం ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు. తొలుత కవిత రాథోడ్ అనే మహిళకు సీ-బ్లాక్లో 603వ ఫ్లాట్ మంజూరు కాగా, మంత్రులు ఆమెకు సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, గృహనిర్మాణశాఖ ఎండీ వీపీ గౌతమ్, కలెక్టర్ నారాయణరెడ్డి, మాజీ మేయర్ పారిజాతం, అధికారులు పాల్గొన్నారు.