- సీఐఐ భాగస్వామ్య సదస్సులకు విశాఖే శాశ్వత వేదిక అని వెల్లడి
విశాఖపట్నం: ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నీరు, నిప్పు లాంటివాళ్లని, ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఇకపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) భాగస్వామ్య సదస్సులకు విశాఖపట్నమే శాశ్వత వేదిక అవుతుందని ప్రకటించారు. విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్‌లో మాట్లాడిన ఆయన, చంద్రబాబు పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇటీవల రెండు తీవ్రమైన తుఫాన్లు రాష్ట్రాన్ని దెబ్బతీసినా విశాఖ వేగంగా కోలుకుని అంతర్జాతీయ సదస్సుకు వేదిక కావడం అభినందనీయమని అన్నారు. ‘ప్రపంచమంతా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే, చంద్రబాబు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నారు. కాలం కంటే ముందే ఆలోచించి ఏఐ, క్వాంటం టెక్నాలజీల ప్రాధాన్యాన్ని ఎప్పుడో గుర్తించారు’ అని చెప్పారు. 2024లో చంద్రబాబు అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం అప్పుల్లో ఉండి, వ్యవస్థలు ఛిన్నాభిన్నమై ఉన్నా, పట్టుదలతో రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతా తెరవడం పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంచే గొప్ప ముందడుగు అన్నారు.
గణపతిదేవుడి నుంచే భరోసా
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సవాళ్లు నెలకొన్న తరుణంలో పెట్టుబడిదారులకు భారత్ అత్యంత సురక్షితమైన, విశ్వసనీయ గమ్యస్థానమని గోయల్ చెప్పారు. కాకతీయ రాజు గణపతిదేవుడే విదేశీ వర్తకులకు భరోసా కల్పించిన చరిత్ర మనదని, అప్పటి నుంచీ భారత్ విదేశీ భాగస్వాములను గౌరవిస్తూనే ఉందని గుర్తుచేశారు. భారత్ టెక్నాలజీ బదిలీని బలవంతంగా కోరదని, ఇతర దేశాల మేధోసంపత్తిని దొంగిలించదని, మేధో సంపత్తి హక్కులను పూర్తిగా గౌరవిస్తుందని స్పష్టం చేశారు.
విశాఖ ‘స్టీల్ సిటీ’ నుంచి ‘సిలికాన్ సిటీ’గా మారుతోందని, ఓర్వకల్లు, పూడిమడక వంటి ప్రాంతాలు గ్రీన్ ఎనర్జీ హబ్‌లుగా ఎదుగుతున్నాయని తెలిపారు. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారని, అలాంటి తీయని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.
ఏపీకి రూ.5.84 లక్షల కోట్ల పెట్టుబడులు
విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు తొలిరోజే ఆంధ్రప్రదేశ్‌కు రూ.5,84,355 కోట్ల భారీ పెట్టుబడుల హామీలు లభించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో 73 ఒప్పందాలు, 15 ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీటి ద్వారా రాష్ట్రంలో 1,07,693 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. పెట్టుబడులకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా 'ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్' తెస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
2027 ఫిబ్రవరి 3న అమరావతిలో దక్షిణాసియాలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ ప్రారంభిస్తామని తెలిపారు. తయారీ రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.2.73 లక్షల కోట్లు, పర్యావరణ హిత విద్యుత్ రంగంలో గ్రీన్కో రూ.45,000 కోట్లు, క్లీన్‌మ్యాక్స్ రూ.41,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అద్భుత ప్రగతి సాధిస్తోందని ప్రశంసించారు.
