- పదవికి రిజైన్ చేసిన జెన్సన్ హువాంగ్
- చైనా గూఢచారిగా అనుమానిస్తున్న మహిళతో సంబంధం
- కంపెనీ ఎగ్జిక్యూటివ్‌తోనూ అఫైర్ అంటూ రిపోర్టులు
- తాత్కాలిక సీఈఓగా సీఎఫ్‌ఓ కొలెట్ క్రెస్
- కొత్త సీఈఓగా యాపిల్ టిమ్ కుక్‌ను నియమించాలని ట్రంప్ సలహా
న్యూయార్క్: ఏఐ చిప్‌ల తయారీ కంపెనీ ఎన్విడియా చరిత్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 1993లో సంస్థను స్థాపించి, గత 33 ఏళ్లుగా సీఈఓగా, ప్రెసిడెంట్‌గా కంపెనీని టాప్లెవెల్కు తీసుకెళ్లిన జెన్సన్ హువాంగ్ తన పదవులకు రాజీనామా చేశారు. రెండు వివాహేతర సంబంధాల ఆరోపణల నేపథ్యంలో బుధవారం రాత్రి అత్యవసరంగా సమావేశమైన ఎన్విడియా బోర్డు, హువాంగ్ను తప్పించాలని నిర్ణయించింది. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చింది.
ప్రస్తుత చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) కోలెట్ క్రెస్‌ను తాత్కాలిక సీఈఓగా నియమించారు. కంపెనీ చరిత్రలో తొలిసారిగా బోర్డు చైర్మన్ పదవిని సృష్టించి, సినాప్సిస్ మాజీ సీఈఓ హార్వే జోన్స్‌ను నియమించారు. శాశ్వత సీఈఓ కోసం కంపెనీ వెతకడం ప్రారంభించింది. ప్రస్తుతానికి యాపిల్ హార్డ్‌వేర్ చీఫ్ జానీ స్రౌజీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్విడియాకు ఇంతవరకు ఫార్మల్ సక్సెషన్ ప్లాన్ లేదు. అందుకే ఇప్పుడు సీఈఓ ఎంపిక చాలా కష్టమైన పనిగా మారింది. ఇదిలా ఉంటే ఎన్విడియా కంపెనీకి యాపిల్ మాజీ సీఈఓ టిమ్ కుక్‌ను నియమించడం బెటర్ అని, ఒక లెజెండ్‌ను ఇంకో లెజెండ్ భర్తీ చేస్తారని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అసలు సమస్య అలిస్ వల్లే..
సింగపూర్‌కు చెందిన క్లౌడ్ ప్రొవైడర్ 'మెగాస్పీడ్' ( ఎన్విడియాకు పెద్ద కస్టమర్) ఎగ్జిక్యూటివ్ అలిస్ హువాంగ్‌తో జెన్సన్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆమె చైనా నిఘా సంస్థలకు అమెరికా ఏఐ చిప్ రహస్యాలను చేరవేసిందని 'న్యూయార్క్ టైమ్స్' రిపోర్ట్ చేసింది. చైనాకు అడ్వాన్స్డ్ చిప్‌ల ఎగుమతుల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను జెన్సన్ ప్రభావితం చేశారా అనే కోణంలోనూ విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో తమ దేశానికి రాకుండా ఆలిస్ హువాంగ్‌పై సింగపూర్ నిషేధం విధించింది. జెన్సన్ ఎన్విడియా హెల్త్‌కేర్ వైస్ ప్రెసిడెంట్ కింబర్లీ పావెల్‌తో కూడా సంబంధం పెట్టుకున్నట్టు ఐదుగురు మాజీ ఉద్యోగుల ఆధారంగా న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. కంపెనీ నిబంధనల ఉల్లంఘన కారణంగా బోర్డు ఆయనను తప్పించక తప్పలేదు.
కంపెనీ షేర్లు 14 శాతం క్రాష్
సీఈఓ హువాంగ్ రాజీనామా చేయడంతో ఎన్విడియా షేర్లు గురువారం 14 శాతం పతనమై 148 డాలర్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. చివరికి కోలుకొని 5 శాతం లాస్‌తో 166 డాలర్ల వద్ద కదిలాయి. సంస్థ మార్కెట్ విలువ ఈ ఏడాది అక్టోబర్ 6 నాటి రూ.475 లక్షల కోట్ల (5 ట్రిలియన్ డాలర్ల ) స్థాయి నుంచి దాదాపు రూ.95 లక్షల కోట్లు తగ్గింది.
