రవీంద్రభారతి, వెలుగు: కార్మికులు, పారిశ్రామిక సంస్థల యాజమాన్యాల మధ్య పరస్పర సహకారం ఉన్నప్పుడే ఇరు వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కార్మికులు సంతోషంగా ఉన్నప్పుడే పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కనీస వేతనాల చట్టం సక్రమంగా అమలు కాలేదని విమర్శించారు.
ప్రస్తుతం పారిశ్రామికవేత్తలందరితో సంప్రదింపులు జరిపి కనీస వేతనాల చట్టాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో గురువారం కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ నిర్వహణలో, భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సీపీ రాజు రచించిన ‘ది సైలెంట్ ఆర్కిటెక్ట్’ పువిష్కరణ సభ జరిగింది. కనీస వేతనాల సలహా మండలి మాజీ అధ్యక్షుడు ఆర్. రామమోహనరావు జీవిత చరిత్రగా రూపొందించిన ఈ పుస్తకాన్ని ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు.
