మణుగూరు: పాప కోసం పూజ..నాలుగు ప్రాణాలు తీసిన అనుమానం

మణుగూరు: పాప కోసం పూజ..నాలుగు ప్రాణాలు తీసిన అనుమానం
  •     మంత్రాలు చేస్తున్నారని ఇద్దరిని చంపి పాతిపెట్టిన్రు
  •     తమనూ చంపుతారనే భయంతో కొడుకు, కోడలు ఆత్మహత్య
  •     ఆ చిన్నారికి తాత, అమ్మా, నాన్న దూరం
  •     మణుగూరు మండలం బుడుగులలో ఘోరం

మణుగూరు, వెలుగు: ఓ చిన్నారి ఆరోగ్యం బాగుపడాలని తాత చేయించిన పూజ.. చివరికి ఆ పాపకు తాతను, అమ్మను, నాన్నను దూరం చేసింది. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్తులే ఇద్దరిని చంపి అడవిలో పాతిపెట్టగా, తమనూ చంపుతారేమోనన్న భయంతో వారిలో ఒకరి కొడుకు, కోడలు ప్రాణాలు తీసుకున్నారు. మూఢనమ్మకం ఒక కుటుంబాన్నే చిదిమేసిన ఈ హృదయవిదారక ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బుడుగుల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రాంబాబు (30), సునీత (25) దంపతులు బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రాణం తీసిన అనుమానం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సీఐ నాగబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌‌‌‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన పద్దం మాసయ్య కొడుకు రాంబాబు బుడుగులలో ఉంటున్నాడు. రాంబాబు, సునీతల కూతురి ఆరోగ్యం బాగాలేకపోవడంతో మాసయ్య, ఆళ్లపల్లి మండలం భూసురాయి గ్రామంలో ఉండే బీమాను ఆశ్రయించాడు. గత నెల 6న బీమాను బుడుగులకు తీసుకొచ్చి పాప కోసం పూజలు చేయించాడు. వాళ్లు చేతబడి చేస్తున్నారని అనుమానించిన గ్రామానికి చెందిన ఐదుగురు, మరుసటి రోజు ఉదయం భూసురాయికి వెళ్తున్న మాసయ్య, బీమాలను గ్రామ సమీపంలోని అడవిలో హత్య చేసి అక్కడే పాతిపెట్టారు. ఇద్దరి ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదు రోజుల కింద పశువుల కాపరులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. విచారణలో హత్య చేసినవాళ్లను గుర్తించారు.

భయమే బలి తీసుకుంది

తమ కూతురి కోసం పూజలు చేయించినందుకే మాసయ్య, బీమాను చంపారని, తమనూ చంపుతారని సునీత తీవ్రంగా భయపడిపోయింది. ఊరు విడిచి వెళ్లిపోదామని భర్తను కోరినా అతడు ఒప్పుకోలేదు. ఆ భయంతోనే బుధవారం ఉదయం ఆమె ప్రాణం తీసుకునే ప్రయత్నం చేసింది. గ్రామస్తులు ఆమెను దవాఖానకు తీసుకెళ్లకుండా నాటు వైద్యం చేయడంతో పరిస్థితి విషమించి చనిపోయింది. భార్య మరణంతో మనస్తాపానికి గురైన రాంబాబు కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. రోడ్డు సౌకర్యం లేక గ్రామస్తులు అతడిని మంచంపై మోసుకుంటూ బుగ్గ గ్రామం వరకు తీసుకొచ్చి, అక్కడి నుంచి 108లో మణుగూరు ప్రభుత్వ దవాఖానకు, ఆ తర్వాత భద్రాచలం ఏరియా దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం రాంబాబు కూడా చనిపోయాడు. రాంబాబు సోదరుడు చుక్కయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

చేతబడి లేదు.. అనుమానమే ప్రాణాంతకం
చేతబడి, బాణామతి, మంత్రాలు అనేవి లేవని, అవన్నీ మూఢనమ్మకాలేనని శాస్త్రం ఎప్పుడో తేల్చిచెప్పింది. అయినా ఇప్పటికీ ఏజెన్సీ పల్లెల్లో ఎవరికైనా జబ్బు చేసినా, పశువులు చనిపోయినా, పంట పండకపోయినా ఎవరో మంత్రాలు చేశారనే అనుమానంతో అమాయకులను చంపేస్తున్నారు. ఈ ఘటనలో ఒకే మూఢనమ్మకం రెండు వైపులా ప్రాణాలు తీసింది. పాప ఆరోగ్యం కోసం వైద్యుడి దగ్గరికి కాకుండా పూజారి దగ్గరికి వెళ్లడం, ఆ పూజను చేతబడిగా అనుమానించి హత్య చేయడం, ప్రాణాపాయంలో ఉన్న సునీతను దవాఖానకు కాకుండా నాటు వైద్యానికి వదిలేయడం. చివరికి మిగిలింది ఓ చిన్నారి ఒంటరితనమే. జబ్బు చేస్తే దవాఖానకే వెళ్లాలని, చేతబడి పేరుతో ఎవరిపైనైనా దాడి చేస్తే అది హత్యే అవుతుందని ఏజెన్సీ పల్లెల్లో పోలీసులు, వైద్యశాఖ, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.