హైదరాబాద్, వెలుగు: కేవలం 200 రిజిస్ట్రేషన్ ఫీజు కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం పట్ల హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి లతో కూడిన ధర్మాసనం విస్మయాన్ని వ్యక్తం చేసింది. చిన్న చిన్న విషయాల్లో పట్టుదలకు పోతే వాద ప్రతివాదులకే కాకుండా కోర్టులపై కూడా పని భారం పెరుగుతుందని పేర్కొంది. ఆర్థిక కోణంలో కూడా ఇరువురికి నష్టమని వ్యాఖ్యానించింది.ఇరుపక్షాలతో న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి మాట్లాడటంతో పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు పిటిషనర్ సమ్మతించారు.
అపోలో ఆసుపత్రిలో ఔట్ పేషెంట్‌గా వైద్యం చేయించుకునేందుకు వెళ్లిన రోగి నుంచి రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీలోని విశాఖపట్నానికి చెందిన శంకర్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..పిటిషనర్ నుంచి రూ.200 వసూలు చేయడం అక్రమమన్నారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ..ఈ చిన్న మొత్తానికి రాష్ట్ర వినియోగదారుల కమిషన్, జాతీయ వినియోగదారుల కమిషన్, ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్లి తిరిగి మళ్లీ హైకోర్టులో వాదనలు వినిపించాల్సిన అంత కీలక కేసా అని వ్యాఖ్యానించింది.
వైద్యుడి కన్సల్టేషన్ కోసం రూ.500 చెల్లించడంపై అభ్యంతరం లేనప్పుడు, రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజుపై మాత్రమే ఎందుకు వివాదమని ప్రశ్నించింది. ఏ ఆసుపత్రిలోనైనా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఒక నిర్దిష్టమైన విధానం ఉంటుందని తెలిపింది. రోగి వైద్య వివరాలు తదితర సమాచారాన్ని భద్రపరచడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించింది. రూ.200 కోసం న్యాయస్థానం సమయాన్ని వృథా చేయడం సబబుకాదని పేర్కొంది. ఆస్పత్రి కూడా రూ.200 తిరిగి చెల్లిస్తే సరిపోయేది కదా ప్రశ్నించింది. వివాద పరిష్కారానికి ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారని ఇరుపక్షాలను అడిగి మందలించింది.ఈ నేపథ్యంలో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని పిటిషనర్ చెప్పడంతో ధర్మాసనం ఆమోదించింది.
