- ఐఏఎస్‌ల పర్యటన తర్వాత మెరుగుపడుతున్న జనరేషన్
- 4 యూనిట్ల ద్వారా రోజుకు 2,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
- ఇటీవల 5వ యూనిట్ సింక్రనైజేషన్
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) పూర్తిస్థాయి ఉత్పత్తి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ఐఏఎస్‌ల నిరంతర పర్యవేక్షణతో ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా మెరుగుపడింది. ప్రస్తుతం నాలుగు యూనిట్ల ద్వారా రోజుకు 2,800 మెగావాట్ల విద్యుత్ గ్రిడ్‌కు అందుతుండగా, ఇటీవలే 5వ యూనిట్ సింక్రనైజేషన్ విజయవంతంగా పూర్తయింది. డిసెంబర్ నాటికి పూర్తి సామర్థ్యంతో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించేలా అధికారులు శ్రమిస్తున్నారు.
గణనీయంగా పెరిగిన ఉత్పత్తి సామర్థ్యం
మూడు, నాలుగు నెలల కింద జిగట (స్టికీ), స్లర్రీ బొగ్గు సరఫరా, ప్లాంట్‌లో సాంకేతిక సమస్యల వల్ల యాదాద్రి పవర్ స్టేషన్లో ఉత్పత్తి 1,700 మెగావాట్లకు పడిపోయింది. దీంతో ప్లాంటు వద్దే ఉండి బొగ్గు సరఫరా, ఉత్పత్తిని సమీక్షించేందుకు ప్రభుత్వం ఐదుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసింది. వీరు వైబ్రేటింగ్ గ్రిజ్లీ ఫీడర్లలో మార్పులు, బెల్టులు, స్కర్ట్ ప్యాడ్ల సర్దుబాటు, పుల్లీల మార్పిడి వంటి పనులు పూర్తి చేయించడంతో గతనెల చివరి వారంలో ఉత్పత్తి రోజుకు 2 వేల నుంచి 2,100 మెగావాట్లకు, ప్రస్తుతం 2,700 మెగావాట్లకు చేరుకుంది. బాయిలర్లకు బొగ్గు సరఫరాలో ఏర్పడుతున్న అడ్డంకులను తొలగించడానికి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ వ్యవస్థలో కీలక మార్పులు చేశారు. బీహెచ్‌ఈఎల్ సహకారంతో పూర్తిస్థాయిలో గంటకు 2,500 టన్నుల బొగ్గు ప్రాసెస్ చేసేలా ప్లాంట్‌ను రిపేరు చేయించారు. దీంతో రోజుకు సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల బొగ్గుతో కూడిన 12 నుంచి 14 రైల్వే రేకులను వేగంగా అన్‌లోడ్ చేసే వీలు కలుగుతుంది.
పూర్తి స్థాయి ఉత్పత్తి దిశగా అడుగులు
800 మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి యూనిట్-5ను డిసెంబర్ 2026 నాటికి కమిషన్ చేయాలని అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఆ తర్వాత రెండు నెలల్లో స్థిరీకరణ ప్రక్రియ పూర్తయితే, యాదాద్రి పవర్ స్టేషన్ పూర్తి సామర్థ్యం 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి స్థాయికి చేరుకుంటుందని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఆశిస్తున్నారు. ప్లాంట్‌కు నిరంతరాయంగా బొగ్గు అందేలా ఒడిశాలోని నైనీ బ్లాక్, కోల్ ఇండియా సంస్థల నుంచి సరఫరా లింకేజీలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఫ్లాంట్ఫుల్కెపాసిటీతో పవర్జనరేషన్ చేయడానికి అనుకూలమైన జీ9 బొగ్గు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, రాష్ట్ర జెన్కో సీఎండీ డా. ఎస్. హరీశ్, బీహెచ్ఈఎల్ పవర్ డైరెక్టర్ తజీందర్ గుప్తా తదితర ఉన్నతాధికారులు గురువారం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)ను సందర్శించారు. స్టేషన్ మొత్తం పనితీరుతో పాటు బొగ్గు నిర్వహణ ప్లాంట్ (సీహెచ్‌పీ), బొగ్గు నాణ్యత, లభ్యత అంశాలను సమీక్షించారు.
6,088 మెగావాట్ల ఆల్-టైమ్ హై థర్మల్ విద్యుత్ ఉత్పత్తి
రాష్ట్ర విద్యుత్ రంగంలో జెన్కో మరో చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. నవంబర్ 11న తొలిసారిగా 6,088 మెగావాట్ల ఆల్-టైమ్ గరిష్ఠ థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. సింగరేణి కాలరీస్, భారతీయ రైల్వేల మధ్య మెరుగైన సమన్వయం, నిరంతర బొగ్గు సరఫరా, జెన్కో ఇంజినీర్లు, ఉద్యోగుల సమష్టి కృషి వల్లే ఈ ఘనత సాధ్యమైందని జెన్ కో ప్రకటించింది. ఈ ఘనత సాధించిన జెన్ కో ఇంజినీర్లను రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్, జెన్ కో సీఎండీ హరీశ్ అభినందించారు.
