ఎల్‌నినో హెచ్చరిక నేపథ్యంలో తెలంగాణలో రబీ సాగు ప్రణాళికలో నీటి పొదుపు ఆధారిత ఉద్యాన సాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. రైతుల రక్షణ, నీటి సంరక్షణ, కూరగాయల లభ్యతకు సకాలంలో కార్యాచరణ కూడా అవసరం. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ వ్యవసాయ రంగానికి ఎల్‌నినో ఒక కీలక సవాలుగా నిలుస్తోంది.
ఈ క్రమంలో రైతుల జీవనోపాధిని కాపాడటం, పరిమిత నీటి వనరులను సంరక్షించడం, కూరగాయలు, పండ్ల సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటం ఇప్పుడు అత్యంత ముఖ్యమైన అంశాలు. జలాశయాల్లో నీటి నిల్వలపై ఒత్తిడి, భూగర్భ జలాల క్షీణత నేపథ్యంలో రబీ సాగుకు రాష్ట్రం ముందస్తు ప్రణాళికతో, శాస్త్రీయ దృక్పథంతో సిద్ధం కావాలి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన 2026–27 రబీ కార్యాచరణ ప్రణాళిక సమయోచిత మార్గదర్శకంగా నిలుస్తోంది.
కూరగాయలు ప్రజల పోషకాహారానికి, ఆహార భద్రతకు, రైతుల ఆదాయానికి కీలకమైనవి. అయితే 2026లో ఎల్‌నినో ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా కూరగాయల ఉత్పత్తి 15–20% వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావం తీవ్రంగా ఉండటంతో అక్కడి నుంచి సరఫరా ఆశించలేం. ఈ పరిస్థితుల్లో మార్కెట్లో ధరలు పెరిగి వినియోగదారులపై భారంపడే ప్రమాదం ఉంది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో రబీ సీజన్‌లో కూరగాయల సాగు విస్తరణ ప్రత్యేక వ్యూహాత్మక అవసరంగా మారింది. భూముల నీటి లభ్యత, స్థానిక వాతావరణం, నేల స్వభావం అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో కూరగాయల సాగుకు ప్రాధాన్యమివ్వాలి. టమోటా, వంకాయ, మిరప, బెండ, గోర్డ్స్, ఆకుకూరలు వంటి పంటలు డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్ వంటి నీటి పొదుపు పద్ధతులతో సాగు చేయవచ్చు.
రైతుల ఆదాయాన్ని పెంచే వ్యూహాత్మక పరిష్కారం
కూరగాయల దిగుమతులు కూడా స్థిరంగా ఉండకపోవచ్చు. గత సంవత్సరాల్లో భారత్, అమెరికా, చైనా వంటి దేశాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకున్నప్పటికీ, ఎల్‌నినో ప్రభావం, రవాణా ఖర్చులు, జియోపొలిటికల్ సమస్యలు కారణంగా సరఫరా తగ్గే అవకాశం ఉంది. పాకిస్తాన్, చైనా సరఫరా ఇప్పటికే తగ్గిపోయింది.
అందువల్ల తెలంగాణలో మాగాణి భూముల్లో కూరగాయల సాగు విస్తరణ వినియోగదారులకు భారం తగ్గించడమే కాకుండా రైతుల ఆదాయాన్ని పెంచే వ్యూహాత్మక పరిష్కారం అవుతుంది. ప్రభుత్వం జిల్లా స్థాయిలో నీటి లభ్యతను అంచనా వేసి, అనువైన ప్రాంతాలను గుర్తించి, నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ సామగ్రి సకాలంలో అందించాలి. రైతులకు ప్రదర్శన ప్లాట్లు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడం, మార్కెట్ డిమాండ్‌తో అనుసంధానం చేయడం, నిల్వ, రవాణా, విక్రయ సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ఈ వ్యూహం విజయవంతం అవుతుంది.
మొత్తంగా ఎల్‌నినో ప్రభావం వల్ల పొరుగు రాష్ట్రాల నుంచి సరఫరా ఆశించలేని పరిస్థితి ఉన్నందున, తెలంగాణలో కూరగాయల సాగు విస్తరణ ఆహార భద్రతకు, రైతుల ఆదాయానికి, వినియోగదారుల రక్షణకు అత్యవసరమైన వ్యూహాత్మక చర్యగా నిలుస్తుంది.
నిరంతర సరఫరాతో రైతులకు త్వరగా ఆదాయం
విశ్వవిద్యాలయం టమాటా, వంకాయ, మిరప, బెండ, చిక్కుడు, గోరుచిక్కుడు, కూరగాయల బొబ్బర, స్నాప్ మెలన్, మునగ వంటి పంటల అనువైన రకాలు, హైబ్రీడ్ల సాగును సూచించింది. పాలకూర, తోటకూర, కొత్తిమీర, మెంతికూర వంటి తక్కువ కాలంలో చేతికొచ్చే ఆకుకూరలు కూడా అదనపు అవకాశాలను అందిస్తాయి. బొబ్బర వంటి పంటలు సుమారు రెండు నెలల్లోనే కోతకు రావచ్చు. ఆకుకూరలు సాధారణంగా 30–45 రోజుల్లో కోతకు సిద్ధమవుతాయి. క్రమపద్ధతిలో విత్తడం, నాటడం ద్వారా రైతులు త్వరగా ఆదాయం పొందడమే కాకుండా మార్కెట్‌కు నిరంతర సరఫరాను కొనసాగించవచ్చు.
దీనివల్ల ఒకేసారి అధిక దిగుబడి మార్కెట్‌కు చేరి ధరలు పెరగడాన్ని కూడా కొంతవరకు నివారించవచ్చు. అయితే సాగు విస్తీర్ణాన్ని పెంచడం ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ప్రతి నీటి బొట్టును సమర్థంగా వినియోగించుకుంటూ అధిక ఉత్పత్తి సాధించడం ప్రధాన లక్ష్యం కావాలి. నీటి కొరత ఉన్న పరిస్థితుల్లో సంప్రదాయ పద్ధతిలో అధికంగా నీరు పెట్టడం వల్ల వృథా పెరుగుతుంది. ఎత్తైన మడులు, బిందు సేద్యం, మల్చింగ్, ఫెర్టిగేషన్ వంటి పద్ధతులు నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచి, కూలీల అవసరాన్ని తగ్గించి, పంటల ఉత్పాదకతను మెరుగుపరచగలవు. ఈ పద్ధతుల ద్వారా నీటి పొదుపుతోపాటు పెట్టుబడికి తగిన ప్రతిఫలం పొందే అవకాశం ఉంది.
ముందస్తు ప్రణాళికతో ఎల్‌నినో ప్రభావం తగ్గించవచ్చు
రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యాచరణ ప్రణాళికను కేవలం సాంకేతిక సలహా పత్రంగా పరిగణించకుండా అమలు చేయాల్సిన ప్రాధాన్య కార్యక్రమంగా గుర్తించాలి. జిల్లాల స్థాయిలో అనువైన మాగాణి ప్రాంతాలను, కూరగాయల సాగు అనుకూల ప్రాంతాలను గుర్తించి, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమగ్రంగా అంచనా వేయాలి. రైతుల అవగాహన కోసం క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించాలి.
నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందించాలి. ఉద్యానశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, మార్కెటింగ్ సంస్థలు సమన్వయంతో పనిచేసి ఉత్పత్తి ప్రణాళికను మార్కెట్ డిమాండ్‌తో అనుసంధానిస్తున్నారు. రైతులు పంటను విజయవంతంగా పండించిన తర్వాత నష్టపోకుండా నిల్వ, రవాణా, మార్కెట్ సమాచారం, విక్రయ సదుపాయాలను ప్రభుత్వం మెరుగుపరచాలి. బిందు సేద్యం, మల్చింగ్ సామగ్రి, నీటి పొదుపు పరికరాలపై రాయితీలు కల్పించి, రైతులకు ప్రాయోగిక శిక్షణ సాంకేతిక సహాయం అందించాలి. గ్రామస్థాయిలో నీటి లభ్యతను అంచనా వేసి, అందుబాటులో ఉన్న వనరులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా సామూహిక నీటి ప్రణాళికలను ప్రభుత్వం ప్రోత్సహించాలి.
ఈవిధంగా ప్రభుత్వం రైతుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతూ, మార్కెట్ అవకాశాలను విస్తరించి, నీటి వనరుల సమర్థ వినియోగాన్ని నిర్ధారిస్తూ, చిన్న రైతులకూ సమాన అవకాశాలు కల్పించాలి. సరైన ముందస్తు ప్రణాళిక, శాస్త్రీయ సలహాలు, సమన్వయంతో కూడిన చర్యల ద్వారా ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించవచ్చు. తెలంగాణలో ఉద్యాన శాస్త్ర పరిజ్ఞానంతో విభిన్న పంటలు, నీటి నిర్వహణను మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయి.
2026–27 రబీ కార్యాచరణ ప్రణాళిక ఈ దిశగా ఒక బలమైన పునాది. సకాలపు అమలు, నిరంతర పర్యవేక్షణ, శాఖల మధ్య సమన్వయం అవసరం. తెలంగాణ ఉద్యాన రంగ భవిష్యత్తు ఎంతభూమిలో సాగు చేస్తున్నామనే అంశంపైనే కాకుండా, అందుబాటులో ఉన్న నీటిని ఎంత వివేకంగా వినియోగిస్తున్నాం. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఎంత సమర్థంగా రైతుల వద్దకు తీసుకెళ్తున్నాం అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. రైతు కేంద్రంగా రూపొందిన సమన్వయ కార్యాచరణ రైతుల జీవనోపాధిని కాపాడటమే కాకుండా కూరగాయల లభ్యతను పెంచి, పోషకాహార భద్రతను బలోపేతం చేస్తుంది. తెలంగాణలో ఎల్‌నినో వాతావరణ మార్పులను తట్టుకునేందుకు ఉద్యాన ఆర్థికవ్యవస్థ తోడ్పడుతుంది.
పండ్ల తోటల రైతులకు ప్రత్యేక మార్గదర్శకత్వం
పండ్ల తోటల రైతులకు కూడా ప్రత్యేక మార్గదర్శకత్వం అవసరం. మామిడి తోటల్లో నీటి సరఫరాను అవసరానికి అనుగుణంగా నిర్వహించడం, అధిక ఉష్ణోగ్రతల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించే చర్యలు చేపట్టడం ముఖ్యం. జామ, సీతాఫలం, సిట్రస్ పండ్లు, ద్రాక్ష, అరటి తదితర పంటల్లో తేమ సంరక్షణ, సేంద్రీయ మల్చింగ్, సమర్థవంతమైన నీటి నిర్వహణ ఉపయోగకరంగా ఉంటాయి. పూత, కాయల అభివృద్ధి వంటి కీలక దశల్లో అవసరమైన రక్షణాత్మక నీటి తడులు ఇవ్వడం ద్వారా తీవ్ర నష్టాలను నివారించవచ్చు. ఆయిల్‌పామ్ సాగును మాత్రం ఏడాది పొడవునా నీటి లభ్యతకు భరోసా ఉన్న ప్రాంతాల్లోనే ప్రోత్సహించాలి. నీటి భద్రత లేని ప్రాంతాల్లో సాగు విస్తరణకు ప్రోత్సాహం ఇవ్వడం సముచితం కాదు.
పంట అవసరాలకు అనుగుణంగా పోషకాలను అందించడం, పురుగుమందులను బాధ్యతాయుతంగా వినియోగించడం ముఖ్యం. అవసరమైనప్పుడు మాత్రమే సిఫారసు చేసిన మోతాదుల్లో మొక్కల సంరక్షణ మందులను వాడాలి. కోతకు ముందు పాటించాల్సిన నిరీక్షణ వ్యవధిని తప్పనిసరిగా అనుసరించాలి. స్థానిక వాతావరణ సమాచారం, డిజిటల్ వ్యవసాయ సలహాలు రైతులకు అందుబాటులో ఉంటే నీటి తడులు, మందుల పిచికారీ, కోత సమయాలను మరింత సమర్థంగా నిర్ణయించుకోవచ్చు.
- డా.రాజిరెడ్డి,
వైస్ చాన్సలర్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
