భారతదేశ రాజకీయాల్లోనే అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2027 ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరగనున్నాయి. ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం మాత్రమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం కూడా యూపీనే. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి యోగి ఆదిత్యనాథ్ రూపంలో బలమైన ముఖ్యమంత్రి ఉన్నారు. 1989 తర్వాత మరే ఇతర పార్టీ సాధించలేనివిధంగా బీజేపీ ఇక్కడ వరుసగా గత 10 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోంది.
మన దేశ రాజకీయ వర్గాల్లో ఒక బలమైన నమ్మకం ఉంది. అదేంటంటే.. ఉత్తరప్రదేశ్‌లో గెలిచిన పార్టీయే కేంద్రంలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వసిస్తారు. కానీ, ఇది వాస్తవం కాదు. ఎందుకంటే.. 2014లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అఖిలేశ్ యాదవ్ అధికారంలో ఉన్నప్పటికీ, కేంద్రంలో మాత్రం బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అదేవిధంగా 1991లో ఉత్తరప్రదేశ్‌లోని 85 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ కేవలం 5 స్థానాలను మాత్రమే గెలుచుకున్నప్పటికీ, పీవీ నరసింహారావు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలాగే 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకుగాను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధిక స్థానాలు గెలిచినప్పటికీ బీజేపీ కేవలం 33 స్థానాల్లోనే గెలిచి రెండోస్థానంలో నిలిచినా కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చింది. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకుగాను బీజేపీ కేవలం 33 స్థానాలను మాత్రమే గెలుచుకోవడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సొంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థాయిలో లోక్‌సభ స్థానాలను గెలుచుకోలేక మిత్రపక్షాల అండతో అధికారం కైవసం చేసుకుంది. అందుకే, ఉత్తరప్రదేశ్‌లో పుంజుకుని మెరుగైన సంఖ్యలో స్థానాలు సాధిప్తే తమకూ మంచి అవకాశం ఉంటుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. 2024 జూన్‌లో ఉన్న పరిస్థితి నేడు లేదు.
బీజేపీకి ప్రతికూలతలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, కేంద్రంలో రెండింటిలోనూ అధికారంలో ఉండటం వల్ల బీజేపీపై 'ప్రభుత్వ వ్యతిరేకత' ప్రభావం ఉండే అవకాశం ఉంది. మరోవైపు 2024 పార్లమెంటరీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల బీజేపీలో ఆత్మవిశ్వాసం తగ్గగా ప్రతి పక్షాల్లో అతివిశ్వాసం పెరిగింది. ధరల పెరుగుదల, వ్యవసాయ రంగ సమస్యలు బీజేపీకి ప్రధాన ఆందోళన కలిగించే అంశాలుగా కొనసాగుతున్నాయి. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, 'జెన్ -జెడ్' రూపంలో నేటి యువత ఒక రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. అయితే ఉత్తరప్రదేశ్‌లోని యువత ఉమ్మడి రాజకీయ డిమాండ్ల కోసం ఏకమవుతారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. కుల రాజకీయాలు కూడా యూపీ ఎన్నికలలో కీలకపాత్ర పోషిస్తాయి.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన పట్ల ఇతర కులాల వారు అసంతృప్తితో ఉన్నారని, మార్పు కోరుకుంటున్నారని ఇప్పటికే అనేక కథనాలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభాలో సుమారు 12% ఉన్న బ్రాహ్మణుల రాజకీయ ప్రాధాన్యతలు ఈసారి జరిగే ఎన్నికలలో ఎలా ఉంటాయనేది బీజేపీకి ఆందోళన కలిగిస్తోంది. నరేంద్ర మోదీ ఒకప్పుడు అత్యంత ప్రజాదరణ కలిగి ఉండేవారు, కానీ ఇప్పుడు ఆ ప్రజాదరణ కొంతమేర తగ్గి ఉండవచ్చు. ఇది ఎన్నికలపై ప్రభావం చూపవచ్చు. ఉత్తరప్రదేశ్ జనాభాలో ముస్లింలు 20% ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో వారు సర్వ సాధారణంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఇండియా కూటమికి ప్రయోజనాలు
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి ఉన్న ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఉత్తరప్రదేశ్‌లో దానికి బలమైన కూటమి ఉంది. 2024లో జరిగిన ఎన్నికలలో ప్రతిపక్ష కూటమి 80 పార్లమెంటు స్థానాలలో 47 స్థానాలను గెలుచుకుని బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని అధిగమించింది. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అగ్రవర్ణ ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇతర వర్గాలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభించేలా, యాదవ్ వర్గాన్ని తక్కువ టిక్కెట్లకు అంగీకరించేలా ఒప్పించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా మైనారిటీ ఓటర్ల మద్దతు కూడగడుతున్నారు. దళిత ఓటర్లనూ ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికలలో ఆయన ఇండియా కూటమికి ఒక శక్తిగా నిలిచే అవకాశం ఉంది.
బీజేపీకి ప్రయోజనాలు
ఉత్తరప్రదేశ్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్ అత్యంత శక్తిమంతమైన ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఆయన మార్చి 2017 నుంచి నిరంతరాయంగా పదవిలో ఉన్నారు. 2027లో సీఎం యోగి తన పదవీకాలం10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు. ఇంత సుదీర్ఘమైన పదవీకాలాన్ని వరుసగా మరే ముఖ్యమంత్రి కూడా కలిగి లేరు. యోగి ఆదిత్యనాథ్ శాంతిభద్రతలకు ప్రాధాన్యతనిస్తారని, నేర ముఠాలను, మాఫియా రాజకీయ నాయకులను తొలిగించే కఠినమైన ముఖ్యమంత్రి అనే ఇమేజ్‌ను పెంపొందించుకున్నారు.
నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండటం వల్ల యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అపూర్వమైన అభివృద్ధిని సాధించింది. యోగి, బీజేపీ సామాజిక ఇంజినీరింగ్‌పై గణనీయమైన దృష్టి సారించారు. ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించడానికి దళితులను, బలహీన వర్గాలను వ్యూహాత్మకంగా ఆకర్షిస్తున్నారు. బీజేపీ కనీసం 70% సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించవచ్చు. 1989 నుంచి అఖిలేశ్ యాదవ్, అతని తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ రాజకీయాలను శాసించారని, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ కూడా ప్రభుత్వ వ్యతిరేకతను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని యోగి గ్రహించి తగిన రాజకీయ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
నరేంద్ర మోదీ ఇమేజ్ ప్రభావం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిస్సందేహంగా ఉత్తర ప్రదేశ్ ఎన్నికలను ప్రభావితం చేస్తారు. మోదీకి ప్రజాదరణ ఇంకా మసకబారలేదు. అదే బీజేపీకి సహాయపడుతుంది. యోగి ఆదిత్యనాథ్ ఇమేజ్ కూడా మోదీ ప్రజాదరణపై ప్రభావం చూపుతుంది. 2027 ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు చివరికి యోగి ఆదిత్యనాథ్, అఖిలేశ్ యాదవ్‌ల మధ్య పోటీగా మారవచ్చు. సీఎం యోగికి బలమైన శాంతిభద్రతలను అందించే రాజకీయ నాయకుడిగా ఇమేజ్ ఉంది. మహిళలు సాధారణంగా భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు. శాంతిభద్రతలతోపాటు యోగి మహిళల కోసం తన ప్రత్యక్ష నగదు పథకాలతో కూడా ఉదారంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోలేని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు సీఎం యోగికి ఉన్నంత ప్రజాదరణ లేదు. అందువల్ల యూపీ ఎన్నికల ఫలితాలు వారి వ్యక్తిగత ప్రజాదరణతోపాటు వారి పొత్తులపై కూడా ఆధారపడి ఉంటాయి.
ఇది ఒక విచిత్రమైన పోటీ
2024 పార్లమెంటరీ ఎన్నికల సమయంలో ఉన్నదానికంటే యూపీ సీఎం యోగి, బీజేపీ ఇప్పుడు బలంగా ఉన్నారని అందరూ అంగీకరిస్తున్నారు. అదేవిధంగా 2022 అసెంబ్లీ ఎన్నికలలో ఉన్నంత బలంగా బీజేపీ ఇప్పుడు లేదని కూడా ప్రత్యర్థులు అంగీకరిస్తున్నారు. ఇది రెండు సమానమైన కూటముల మధ్య జరుగుతున్న ఎన్నికల అంతిమ పోరాటం. ఇందులో ఇరు కూటములు పణంగా పెట్టింది చాలా ఉంది. బీజేపీ ఓడిపోతే యోగి, మోదీ ఇద్దరూ ప్రభావితమవుతారు. అఖిలేశ్ యాదవ్ ఓడిపోతే అది బహుశా యూపీలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఆయన రాజకీయ జీవితానికి ఎదురుదెబ్బ తీయవచ్చు.
ఎందుకంటే కొత్త రాజకీయ శక్తులు ఆవిర్భవిస్తున్నప్పుడు 15 సంవత్సరాలు అధికారం లేకుండా మనుగడ సాగించడం కష్టం. ఈరోజు మాయావతిని చూస్తే ఆమె పతనం యోగి, అఖిలేశ్ ఇద్దరికీ ఒక హెచ్చరిక. ఎన్నికల ఫలితాల అనంతరం పర్యవసానాలు ఉంటాయి. ఓటమిపాలైనవారు రాజకీయంగా ప్రాబల్యాన్ని కోల్పోవచ్చు. రాజకీయ నాయకులు ఎలా కనుమరుగవుతారనడానికి మాయావతి పతనం మంచి ఉదాహరణ, యోగి, అఖిలేశ్ యాదవ్ ఇద్దరూ ఆమెకు పట్టిన రాజకీయగతిని తప్పించుకోవాలని కోరుకుంటున్నారు!
- డా.పెంటపాటి పుల్లారావు
పొలిటికల్ ఎనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
