- కేసును ఏసీబీకి అప్పగించాలని సీఎంకు ఎఫ్ జీజీ లేఖ
హైదరాబాద్, వెలుగు: గచ్చిబౌలి మణికొండ జాగీర్‌లో టీఎన్జీవోలకు కేటాయించిన 50 ఎకరాల (రూ.2,500 కోట్ల విలువైన) ఫ్లాట్ల కేటాయింపులో భారీ అవకతవకలు జరిగాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్ జీజీ) ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి ఆరోపించారు. ఈ కుంభకోణంపై ఏసీబీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఆయన గురువారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ అంశంపై ఏసీబీ లేదా సీబీఐ విచారణ చేయాలని ప్రభుత్వానికి ఇప్పటికే రంగారెడ్డి కలెక్టర్ సిఫార్సు చేశారని గుర్తుచేశారు.
2003లో ప్రభుత్వమిచ్చిన ఈ భూమిని ఎలాంటి అలియనేషన్ చేయించకుండా, హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా, సంఘంలో సభ్యులు కాని అనర్హులకూ ప్లాట్లు కేటాయించారని పద్మనాభరెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. సహకార శాఖ రిజిస్ట్రార్ అడిగినా జాబితా ఇవ్వకుండా పారదర్శకత లేకుండా వ్యవహరించారని తెలిపారు. అంతేకాకుండా, ప్రాంత అభివృద్ధి పేరుతో ఒక్కో కేటాయింపుదారుడి నుంచి రూ.4 లక్షల వసూలు చేసి ఆ నిధులను దుర్వినియోగం చేశారని వివరించారు.
సంఘం కార్యవర్గాలు, సీనియర్ అధికారులు కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకున్నారని, ఈ ఫైల్ ను మాయం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ కేసును ఏసీబీకి అప్పగించాలని పద్మనాభరెడ్డి తన లేఖలో సీఎంకు విజ్ఞప్తి చేశారు.
