Sekhar Master: దేవుడు దయతో బతికి బయటపడ్డాం.. రోడ్డు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ వీడియో రిలీజ్

Sekhar Master: దేవుడు దయతో బతికి బయటపడ్డాం.. రోడ్డు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ వీడియో రిలీజ్

టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రాత్రంతా షూటింగ్‌లో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే అయ్యప్ప స్వామి దయ వల్ల కారులో ఉన్న నలుగురూ ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా శేఖర్ మాస్టర్ వీడియో ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ అయ్యప్ప మాలధారణలో ఉన్నారు. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడటంతో అయ్యప్ప స్వామి కృప వల్లే ఇదంతా సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రమాదం జరిగినప్పటికీ తన షూటింగ్ షెడ్యూల్‌కు బ్రేక్ ఇవ్వకుండా ఇవాళ రాత్రి మళ్లీ షూటింగ్‌కు బయలుదేరుతున్నట్లు వీడియోలో వెల్లడించారు.

దేవుడు దయతో బతికి బయటపడ్డాం: శేఖర్ మాస్టర్

ప్రమాదం జరిగిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు, శేఖర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది ఆయనకు ఫోన్లు, మెసేజ్‌లు చేసి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. దీంతో స్వయంగా శేఖర్ మాస్టర్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఓ వీడియో రిలీజ్ చేసి ప్రమాదం గురించి వివరించారు.

‘‘రాత్రి షూటింగ్ ఫినిష్ చేసుకుని వస్తుండగా ఈరోజు గురువారం ఉదయం 6 గంటల సమయంలో యాక్సిడెంట్ జరిగింది. కారులో మేము నలుగురం ఉన్నాం. కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది. కానీ ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల మాలో ఎవరికీ ఏమీ కాలేదు. అందరం సేఫ్‌గా ఉన్నాం. నా ఆరోగ్యం గురించి చాలామంది మెసేజ్‌లు చేస్తున్నారు. అందరూ ఆందోళన చెందుతున్నారు. అందుకే మీ అందరికీ విషయం చెప్పేందుకు ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సో మచ్’’ అని శేఖర్ మాస్టర్ తెలిపారు.

శంషాబాద్ వద్ద ప్రమాదం..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'కాకా' సినిమా సాంగ్ చిత్రీకరణలో శేఖర్ మాస్టర్ పాల్గొన్నారు. బుధవారం రాత్రి షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో గురువారం ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో శంషాబాద్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతిని నుజ్జునుజ్జయింది. అయితే కారులో ఉన్న నలుగురిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే మరో కారులోకి మారి శేఖర్ మాస్టర్ తన ప్రయాణాన్ని కొనసాగించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

శేఖర్ మాస్టర్ కారు ప్రమాదానికి గురయ్యారనే వార్త తెలియడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఆయన స్వయంగా వీడియో విడుదల చేసి తాను క్షేమంగా ఉన్నానని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదం తీవ్రతను చూస్తుంటే పెద్ద ప్రమాదం తప్పిందని, కారులో ఉన్న నలుగురూ సురక్షితంగా బయటపడటం అదృష్టమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.