యువత క్రీడలు, సాంకేతిక పరిజ్ఞానం వైపు మళ్లాలి : బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు హేమంగ్ జోషి

యువత క్రీడలు, సాంకేతిక పరిజ్ఞానం వైపు మళ్లాలి : బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు హేమంగ్ జోషి
  • గండిపేటలో నషా ముక్త్ భారత్ సైక్లింగ్ ర్యాలీ

హైదరాబాద్, వెలుగు: యువతే ఈ దేశానికి అతిపెద్ద మానవ వనరని, యువతరం ఆరోగ్యంగా, శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే దేశ భవిష్యత్​ఉజ్వలంగా ఉంటుందని భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) జాతీయ అధ్యక్షుడు, ఎంపీ హేమంగ్ జోషి స్పష్టం చేశారు. నషా ముక్త్ భారత్ లక్ష్యంగా గురువారం గండిపేటలో నిర్వహించిన సైక్లింగ్ ర్యాలీలో యువతతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హేమంగ్ జోషి మాట్లాడుతూ యువత ఎలాంటి మత్తు పదార్థాల బారిన పడకుండా జాగ్రత్త పడాలని, డ్రగ్స్ సంస్కృతిని ప్రోత్సహించే ధోరణులపై తిరగబడాలని పిలుపునిచ్చారు. 

తెలంగాణ యువతలో అపారమైన ప్రతిభ, శక్తిసామర్థ్యాలు ఉన్నాయని, ఆ శక్తిని క్రీడలు, సాంకేతిక పరిజ్ఞానం వైపు మళ్లించి దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. అనంతరం తెలంగాణ యువ అథ్లెట్లతో కలిసి పలు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన యువ క్రీడాకారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ర్యాలీలో బీజేపీ ఎంపీలు కె.లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్, నేతలు పాల్గొన్నారు.

సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలె..

తెలంగాణ బీజేవైఎం పదాధికారులతో డాక్టర్ హేమంగ్ జోషి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో నిరుద్యోగం, నోటిఫికేషన్లు, యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై సమగ్రంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో యువత గొంతుకగా మారి బీజేవైఎం పనిచేయాలని జోషి పిలుపునిచ్చారు. యువత హక్కుల సాధన కోసం నిరంతరం ప్రజల్లో ఉండాలని, గ్రామస్థాయి నుంచి పార్టీ యువ విభాగాన్ని పటిష్టం చేయాలని నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి మిట్టా వంశీకృష్ణ, వైస్​ ప్రెసిడెంట కోమలి నాయక్, సింధూరెడ్డి, హరీశ్వర్ రెడ్డి, యశస్వీ తదితరులు పాల్గొన్నారు.