బంగాళాఖాతంలో వాయుగుండం : 15 తర్వాత తుఫాన్ గా మారే అవకాశం...

 బంగాళాఖాతంలో వాయుగుండం : 15 తర్వాత తుఫాన్ గా మారే అవకాశం...

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అంచనాలు నిజం చేస్తూ.. 2026, నవంబర్ 13వ తేదీన అల్పపీడనం ఏర్పడినట్లు ప్రకటించింది వాతావరణ శాఖ. ఏర్పడిన అల్పపీడనం బలపడుతుందని స్పష్టం చేస్తూ.. నవంబర్ 15వ తేదీ నాటికి.. అంటే వచ్చే ఆదివారం నాటికి వాయుగుండంగా మారనున్నట్లు కన్ఫామ్ చేసింది భాతర వాతావరణ శాఖ. 

ఇప్పుడు ఏర్పడిన అల్పపీడనం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉందని.. ఇది క్రమంగా బలపడి దిశ మార్చుకోనున్నట్లు అంచనా వేస్తుంది వాతావారణ శాఖ. ప్రస్తుతం ఇది వాయువ్య దిశగా కదులుతున్నట్లు వెల్లడించింది. 15వ తేదీ నాటికి వాయుగుండంగా మారే ఈ అప్పపీడనం.. ఆ తర్వాత తుఫాన్ గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. 

ఈ అల్పపీడనం ప్రభావంతో.. అండమాన్ ప్రాంతంలో 13, 14 తేదీల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. అదే విధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో 13 నుంచి 16వ తేదీ వరకు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో 15 నుంచి 17 తేదీల్లో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. అదే విధంగా మధ్య బంగాళాఖాతంలో 16 నుంచి 17 తేదీల్లో బలమైన గాలులు వీయనున్నాయి.

15వ తేదీనాటికి ఏర్పడే వాయుగుండం వల్ల కోస్తాంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. తెలంగాణకు ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.

 మత్స్యకారులకు హెచ్చరిక
 ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏర్పడిన ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ శనివారం నాటికి అదే ప్రాంతంలో మరింత బలపడి సుస్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ తెలిపారు.  
 
బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సముద్రంలో ఉన్నవారు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని సూచించింది.