ములకలపల్లి, వెలుగు : వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాను అందించాలని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) చైర్మన్ కె.మాధవరావు అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వినియోగదారుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడంతోపాటు క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి సకాలంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
నూతనంగా రేషన్ కార్డులు పొందిన గృహజ్యోతి పథకం వర్తించేలా చూడాలని వినియోగదారులు చైర్మన్ ను కోరారు. పామ్ ఆయిల్ తోటల్లో రైతులు కరెంటు లైన్లు మార్పించేందుకు ఖర్చులు వారే భరించాల్సి ఉంటుందని ఎస్ ఈ మహేందర్ తెలిపారు. కార్యక్రమంలో డీఈ బద్రు పవార్, ఎస్ఏఓ శ్రీధర్, ఏడీఈ రాంప్రసాద్, ఏఈ నరేశ్, సబ్ ఇంజినీర్ శ్రీను, మండల సర్పంచులు, విద్యుత్ శాఖ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.
